Special Focus On Telangana: తెలంగాణలో జంపింగ్ సీజన్ మొదలైంది. ఎలక్షన్ షెడ్యూల్ కు ముందే వలసల పర్వం షురూ అయింది.టికెట్ల కేటాయింపు ఖరారు వచ్చేసరికి ఇది మరింత పెరిగింది.చివరి నిమిషం దాకా టికెట్ కోసం ప్రయత్నాలు చేసి..రాదని తెలిసిన వెంటనే కండువా మార్చేస్తున్నారు. కొందరు వెయిట్ చేస్తూనే..ప్రత్యర్థి పార్టీలో కర్చీఫ్ వేస్తున్నారు. టికెట్ కోసం గోడ దూకేందుకు సై అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో జంపింగ్ జిలానీల సీజన్ ఊపందుకుంది టికెట్ కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాల్లో ఉంటూనే ముందు జాగ్రత్తగా ఇతర పార్టీలతో అంతర్గతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఉన్న పార్టీలో టికెట్ వచ్చే అవకాశం లేకపోతే ఇంకో పార్టీలో చేరి పొందే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. గట్టిగా టికెట్ కోసం ప్రయత్నిస్తే ఏదో ఒక పదవి రాకపోతుందా అని మరికొందరు అనుకుంటున్నారు. . అసెంబ్లీ ఎన్నికల వేళ బడాబడా నేతలే కాక ద్వితీయ శ్రేణి నేతలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో.. ఏ కండువా కప్పుకుంటారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పార్టీ కోసం పనిచేస్తామంటూనే తెల్లారే సరికే పార్టీ మారుతున్నారు ఇంకొందరు.
ఎన్నికల సమీపిస్తున్న జంపింగ్ జంపాంగ్ లు జోరందుకుంటున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఐదారుగురికి తప్ప అందరికి మళ్లీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ చాలుసార్లు చెప్పారు. అయినా పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించడం, ఫలానా అభ్యర్థికి టికెట్ ఇస్తే తాము పనిచేయబోమని బెదిరించడం,తమకు టికెట్ ఇవ్వాలని కోరడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి నియోజకవర్గాల్లో సమస్యను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అవసరమైన నియోజకవర్గాల్లో బలమైన నాయకులను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.బడా నేతలనే కాదు చోటామెటా లీడర్ల సైతం గాలం వేస్తోంది.
బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థుల జాబితా ను విడుదల చేసింది. ఈ జాబితా వచ్చిన వెంటనే టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. దీంతో నియోజకవర్గల్లో ప్రత్యర్థి పార్టీలో బలం ఉన్న నాయకులను చేర్చుకుంటే మిగిలిన పార్టీలను దెబ్బతీయవచ్చన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆయా నాయకులు కొన్నిచోట్ల ఎమ్మెల్యేలతో విభేదాల కారణంగా ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నారు. మరికొందరు వేరే పార్టీలో టికెట్ గ్యారంటీగా వస్తుందని ఆశించి పార్టీలోకి చేరుతున్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయి, ద్వితీయ శ్రేణి నాయకుల ఫిరాయింపులు పెరిగే అవకాశాలున్నాయి. టికెట్ ఇస్తే భారీగా ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనకాడకుండా టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలు, మద్యం, రియల్ ఎస్టేట్.. తదితర వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులు టికెట్ కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్, పురపాలక సంస్థల ఛైర్మన్లుగా ఉన్నవారు కూడా తదుపరి గమ్యం శాసనసభ అంటూ హోరాహోరీ ప్రయత్నం చేశారు. ఇలా ప్రయత్నం చేసి టికెట్ దక్కపోయే సరికి ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు.
Also Read: Off The Record: తెలంగాణ బీజేపీ లిస్ట్ ఎప్పుడు? కాషాయ దళం మాత్రం కామ్‌గా ఉంది ఎందుకు..?
ఆర్నెళ్లుగా జంపింగ్ సీజన్ కొనసాగుతోంది.ఎలక్షన్ షెడ్యూల్ కు ముందు..తర్వాత ఇది మరింత ఊపందుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు , కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు పలువురు నేతలు మారారు. అటోళ్లు ఇటు..ఇటోళ్లు అటు చేరిపోయారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోనే జంపింగ్ లు ఎక్కువగా ఉంటున్నాయి.మునుగోడు బై పోల్ టైమ్ లో బీజేపీలోకి జోరుగా ఉన్న వలసలు…అసెంబ్లీలోకి వచ్చే ఆ జోరులేదు. ఆపార్టీలో చేరి సింగిల్ డిజిట్ లోనే ఉంది. ప్రధానంగా వలసలన్నీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉన్నాయి.
వలసల విషయానికొస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జోష్ లో ఉంది. ఆరు గ్యారంటీ పథకాలు ప్రకటించి ఇప్పటికే జనాల్లోకి వెళ్లిన ఆ పార్టీ ఇప్పుడు చేరికలపై సీరియస్ గా దృష్టి పెట్టింది. బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్తులకు గాలం వేస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. చాలా మంది నేతలు కేసీఆర్ ను ఓడించాలంటే కాంగ్రెస్ లో చేరడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. అందుకే చాలా మంది సీనియర్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. టీపీసీసీ కూడా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. విభేదాలను పక్కన పెట్టి నేతల ఇళ్లకెళ్లి మరీ స్వాగతం పలుకుతోంది.
కర్నాటక ఎన్నికల ఫలితాల వరకూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అస్సలు హైప్ లేదు. ఆ పార్టీ వైపు చూసే నేతలు కూడా లేరు. పైగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీని వదిలేసి బీఆర్ఎస్, బీజేపీ గూటికి చేరిపోయారు. ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవడం ఖాయమనుకున్నారు. అయితే ఎన్నికలకు కొన్ని నెలల ముందు సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్, బీజేపీలోని పలువురు కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూశారు.
ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను వలసల గుబులు పట్టి పీడిస్తోంది. ప్రధాన అభ్యర్థులు మొదలు.. బూత్‌స్థాయి కేడర్ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకు వెన్నంటే ఉన్న లీడర్లు, కార్యకర్తలు.. అకస్మాత్తుగా పార్టీని వీడి మరో పార్టీలో చేరుతుండటాన్ని నియోజకవర్గ ముఖ్య నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ కాంట్రాక్టులతో అధికార బీఆర్‌ఎస్ ప్రతిపక్ష కాంగ్రె్‌స్, బీజేపీ కార్యకర్తలకు గాలం వేస్తుంటే.. అధికార పార్టీపై ద్వితీయ శ్రేణి కేడర్‌లో నెలకొన్న అసంతృప్తి, తెలంగాణ ఉద్యమకారులకు సరైన గుర్తింపు లభించని అసంతృప్తులకు ప్రతిపక్ష పార్టీలు గాలం వేస్తున్నాయి.మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వలసలు భారీగా ఉంటున్నాయి. బీఆర్ఎస్ లో టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టికెట్ ఆశించి భంగపడ్డ కీలక నేతలు, నాయకులు, బీజేపీలో ప్రాధాన్యత దక్కని లీడర్లు..ఇలా ఇప్పుడు వీళ్లందరి గమ్య స్థానం కాంగ్రెస్గా మారిందనే ఇలా పరిస్థితి ఉంది.