Sabitha Indrareddy: హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. విద్యార్థులకు మంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మా తోబుట్టువుగా సబితా రెడ్డికి సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామన్నారు. విద్యార్థులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే తీర్చాలి లేకుంటే ఆ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.\
Bandi Sanjay: ఇక్కడ ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నాడు?
మరోవైపు బాసర ఆర్జీయూకేటీలో తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ శనివారం రాత్రి నుంచి విద్యార్థులు భోజనం చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇన్‌ఛార్జ్ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్ విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ విద్యార్థులు శాంతించలేదు. సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొనే వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు. మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు భాజపా ఎంపీ సోయం బాపురావు వస్తుండగా లోకేశ్వరం మండలంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల ఆందోళన దృష్ట్యా ఆర్జీయూకేటీ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆర్జీయూకేటీలో ఆహారం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.