వాళ్లిద్దరూ భార్యాభర్తలు… పెళ్లైన మొదట్లో అంతా బాగానే ఉంది… తర్వాత అనుమానం రోగం భర్తను వెంటాడింది… పెద్దలు సర్దిచెప్పినా అనుమానం తీరలేదు… చివరకు ఊరు మారితే మనిషి మారతాడనుకున్నాడని భార్య భావించింది… కానీ అనుమానం పెనుభూతంగా మారింది… చివరకు భార్యను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు… దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వీరి పేర్లు వెంకటేశ్వర్లు, కృష్ణకుమారి. వెంకటేశ్వర్లుది పల్నాడు జిల్లా బొల్లాపల్లి. అదే మండలం మేళ్లవాగుకు చెందిన కృష్ణకుమారికి ఇరవై ఏళ్లక్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. పెళ్లైన మొదట్లో అంతా బాగానే ఉంది. కొన్నాళ్లక్రితం వీరి కాపురంలో విభేదాలు మొదలయ్యాయి. పెద్దలు సర్దిచెప్పడంతో కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. మళ్లీ తిరిగి గొడవలు మొదలయ్యాయి…
భర్త వెంకటేశ్వర్లు వేధింపులు భరించలేని భార్య కృష్ణకుమారి పుట్టింటికి వచ్చింది. మళ్లీ పెద్దమనుషులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. దీంతో వెంకటేశ్వర్లు కూడా మేళ్లవాగు వచ్చి భార్యతో కలిసి ఉండడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న వెంకటేశ్వర్లు మళ్లీ తన నిజస్వరూపం బయటపెట్టాడు…
వెంకటేశ్వర్లుకు భార్యపై అనుమానం. తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను నిత్యం వేధించేవాడు. తనకు ఎవరితో వివాహేతర బంధం లేదని ఎంత చెప్పినా భర్త నమ్మలేదు. ఐతే ఊరు మారితే భర్త తీరులో మార్పు వస్తుందని కృష్ణకుమారి ఆశపడింది. కానీ ఆమె ఆశలు అడియాశలే అయ్యాయి. ఊరు మారినా కూడా అదే అనుమానంతో వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో భర్త ఏమన్నా పట్టించుకోవడం మానేసింది…
క్రమంగా అనుమానం పెరిగి పెద్దదవడంతో వెంకటేశ్వర్లు రాక్షసుడిలా మారాడు. పక్కా పథకం ప్రకారం భార్యను హత్య చెయ్యాలని డిసైడయ్యాడు. ఎప్పటిలాగానే భార్యతో కలిసి పొలానికి వెళ్లాడు. చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో కత్తితో భార్య కృష్ణకుమారిపై దాడిచేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. తర్వాత పొలంనుంచి పరారయ్యాడు. సాయంత్రమైనా తల్లితండ్రులు ఇంటికి రాకపోవడంతో ఇద్దరు పిల్లలు ఇరుగు పొరుగుతో కలిసి పొలానికి వెళ్లారు. పొలంలో కృష్ణకుమారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే కృష్ణకుమారితోపాటు పొలానికి వచ్చిన భర్త వెంకటేశ్వర్లు కనిపించకపోవడంతో అందరూ అతనిపై అనుమానం వ్యక్తం చేశారు. అనుమానంతో భార్యను చంపి పరారై ఉంటాడని భావించారు…
పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. భర్త వెంకటేశ్వర్లు కోసం గాలింపు మొదలుపెట్టారు. అయితే మరుసటిరోజు ఎక్కడైతే కృష్ణకుమారిని హత్య చేశాడో అదే ప్రాంతానికి వచ్చిన వెంకటేశ్వర్లు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలం పనులకు వచ్చిన స్థానికులు వెంకటేశ్వర్లు చెట్టుకు ఉరేసుకుని చనిపోయి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
అనుమానంతో భార్యను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోవడంతో మేళ్లవాగులో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లితండ్రులు మృతిచెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు…
husband-kills-wife-suicide-due-to-suspicion-palnadu-tragedy