ఇళ్లలో పేపర్లు కనిపిస్తే చాలు ఎలుకలు నుజ్జు నుజ్జు చేసిన ఘటనలు ఎన్నో చూసి ఉంటారు.. కానీ, ఓ వృద్ధుడు తన ఆపరేషన్ కోసం కష్టపడి సంపాదించి కొంత… అప్పు తెచ్చి మరికొంత.. ఇంట్లో దాచుకున్నాడు.. కానీ, ఆ మొత్తం సొమ్మును ఎలుకలు నుజ్జు..నుజ్జు చేయడంతో లబోదిబోమనడం బాధితిడి వంతు అయ్యింది… మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం వేంనూర్ శివారు ఇందిరానగర్ తండాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇందిరానగర్ తండాకు చెందిన రెడ్యా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత 4 సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురికావడంతో మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని వైద్యులను కలిశాడు.. కడుపులో కంతి ఉందని.. హైదరాబాద్ వెళ్లాలని.. రూ. 4 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు.. దీంతో కడుపులో నొప్పితో ఒకవైపు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కొంత సొమ్ము కూడబెట్టిన ఆయన.. మరోవైపు అప్పుగా తీసుకొచ్చిన సొమ్ము సుమారు 2 లక్షల రూపాయలను తన ఇంట్లోని బీరువాలో దాచి పెట్టాడు. ఇక, ఆస్పత్రికి వెళ్లేందుకు సిద్ధమై.. బీరువాలోని డబ్బులు తీసి చూస్తే.. కరెన్సీ నోట్లు మొత్తం నుజ్జు నుజ్జుగా మారిపోయాయి.. దీంతో లబోదిబోమనడం ఆ వృద్ధిడి వంతు అయ్యింది.. ఇక, ఆ చిరిగిపోయిన నోట్లను తీసుకోవాలని మహబూబాబాద్ లోని అన్ని బ్యాంకుల చుట్టూ తిరిగాడు. ఎవరూ ఇక్కడ చెల్లవని, హైదరాబాద్‌లో రిజర్వు బ్యాంకుకు వెళ్లాలని, అక్కడ కూడా ఈ నోట్లను తీసుకుంటారో, తీసుకోరో కూడా చెప్పలేమంటూ అనడంతో.. ఆ వృద్ధుడు కన్నీటి పర్యంతం అవుతున్నారు. నాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.