ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మూడు మూడ్ నుంచి బయటికి రాలేకపోతోందా? వరుసగా మూడు ఎన్నికల నుంచి మూడో స్థానానికే పరిమితం అయి పడుతూ.. లేస్తున్న చోట ఇప్పుడు మూడు ముక్కలాట మొదలైందా? ఇన్ఛాలేని చోట మాకంటే… మాక్కావాలంటూ… నేతలు పావులు కదుపుతున్నారా? అంగట్లో అన్నీ ఉన్నా…. అన్న సామెతని గుర్తు చేస్తున్న ఆ నియోజకవర్గం ఏది? ఎవరా మూడు ముక్కలాట ప్లేయర్స్? కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం…. 2004 తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం దక్కలేదు. 2009లో రెండోస్థానం దక్కించుకున్న హస్తం పార్టీ… వరుసగా గత మూడు ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితమైంది. గత ఎన్నికల వరకు కరీంనగర్ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ వెళ్లడంతో ఇక్కడ నాయకత్వ కొరత ఏర్పడింది. గత అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పార్టీలో చేరిన పురుమల్ల శ్రీనివాస్‌కి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. అయినా ఫలితంలో ఏ మార్పు లేకుండా థర్డ్ ప్లేస్‌కే పరిమితమైంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినా… కరీంనగర్‌లో మాత్రం పట్టు చిక్కలేదు.అసలే అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితిలో మంత్రి పొన్నంని, ఇతర నేతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇన్ఛార్జ్ పురుమల్ల పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. జిల్లా మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు అనుచరులు వేర్వేరు కార్యక్రమాలు చేస్తూ ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో కొత్తగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇన్ఛార్జ్ పదవి ఖాళీగా ఉండటంతో పలువురు నాయకులు ఆ పదవిపై కన్నేశారట. అందులో ముగ్గురు మాత్రం మాకంటే మాకు అంటూ సీరియస్‌గా పావులు కదుపుతుండటం ఉత్కంఠ రేపుతోందట స్థానికంగా. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్ రావు, ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మూడు గ్రూపులుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించడం కాకరేపుతోంది. ఇంతకాలం లోలోపల మాత్రమే గ్రూపులుగా ఉన్న ఈ వ్యవహారం… తాజాగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సభతో మూడు శిబిరాలుగా ఓపెన్ అయిపోయిందంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే పాల్గొన్న సభ కోసం కరీంనగర్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో ముగ్గురూ కలిసే పాల్గొన్నారు. కలిసే కేడర్‌ని హైదరాబాద్ తరలించాలని అనుకున్నారు. రాత్రికి రాత్రే ఏమైందోగానీ… తెల్లారేసరికి ఎవరికి వారు తమ వర్గీయులతో ర్యాలీగా వెళ్ళిపోవడం చర్చనీయాంశం అయింది. ఈ పోటాపోటీ ర్యాలీలతో కరీంనగర్ కాంగ్రెస్ లో జరుగుతున్న మూడుముక్కలాట బయట పడ్డట్టు అయిందంటున్నారు పరిశీలకులు. అయితే అందుకు ఎవరి లెక్కలు వారికి ఉన్నాయంటున్నారు కొందరు.
ప్రస్తుతం నాయకత్వ లేని కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ తమకు సేఫ్ జోన్ అని భావిస్తున్నారట ముగ్గురూ. వెలిచాల రాజేందర్ రావు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కరీంనగర్ సీట్ ఆశించారు… కుదరకపోవడంతో…. అప్పటి హామీ మేరకే ఎంపీ టికెట్ దక్కిందట. తక్కువ వ్యవధిలో టిక్కెట్ దక్కినా… గట్టి పోటీ ఇవ్వగలిగారన్న విశ్లేషణలు ఉన్నాయి. రాజేందర్‌రావు తండ్రి జగపతిరావు దాదాపు 20 ఏళ్ళు కరీంనగర్ పాలిటిక్స్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. తండ్రికి ఉన్న పాత పరిచయాలు తనకు లాభిస్తాయన్న లెక్కలతో వెలిచాల సీరియస్‌గా పని చేస్తున్నట్టు సమచారం. అన్నీ కలిసి వస్తే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అవ్వాలన్నది ఆయన టార్గెట్ అట. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సైతం కరీంనగర్ అసెంబ్లీ పై కాన్సంట్రేట్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా… ఆ సమయంలో తన సొంత టీమ్‌తో నగరంలో బేస్ సిద్ధం చేసుకున్నారట నరేందర్‌రెడ్డి. తన విద్యాసంస్థలు ఇక్కడే ఎక్కువ ఉండటం కలిసిస్తుందన్న కేలిక్యులేషన్‌లో ఉన్నారట ఈ లెక్కల మాస్టర్. ఈ ఇద్దరు కాకుండా గత 15 ఏళ్ల నుంచి పార్టీని వీడకుండా లాయల్ గా పనిచేసిన నగర పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కూడా ఇన్ఛార్జ్ పదవి కోసం సీరియస్ ట్రయల్స్‌లో ఉన్నట్టు తెలిసింది. పార్టీ అధికారంలోకి రాగానే ఆయనకు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ పదవి దక్కింది… కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం 90శాతం నగర పరిధిలోనే ఉంటుంది. దాదాపు 8 ఏళ్ల నుంచి నగర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడం తనకు కలిసివస్తుందన్నది నరేందర్‌రెడ్డి లెక్కగా చెబుతున్నారు. పాత కాంగ్రెస్ కార్యకర్తలంతా తనవెంట ఉండటం… మంత్రి శ్రీధర్ బాబు అండ అసెట్ అవుతాయని భావిస్తున్నారట ఆయన. ఇలా ముగ్గురు నేతలు తెరపైకి రావడం… ఒక్కసారిగా యాక్టివ్ అవడం ఆసక్తికరంగా మారింది. కానీ… వీళ్ళ వెనక ఎవరున్నారన్నదే ఇక్కడ కీలకం. మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు ఆశీర్వాదాలు ఎవరికి ఉంటే వారికే పగ్గాలన్నది ఖాయం. ఇద్దరు మంత్రులు కలిసి ఒకరికే ఓటేస్తారా? ఆ ఒకరికి ఇస్తే… మిగతా ఇద్దరూ ఏం చేస్తారన్నది ప్రస్తుతం కరీంనగర్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్.