AICC వ్యవహారాల తెలంగాణ ఇంచార్జ్ మాణిక్‌రావు థాక్రే ముందున్న సవాళ్లేంటి? మరోసారి మూడు రోజులు హైదరాబాదులోనే ఉండే ఆయన.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారా? కాంగ్రెస్ అధిష్ఠానం థాక్రేకి ఏం చెప్పింది?
కొత్త ఇంఛార్జ్ థాక్రే ముందు అనేక సవాళ్లు
తెలంగాణ కాంగ్రెస్‌కు చికిత్స మొదలు పెట్టిన పార్టీ హైకమాండ్ AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ను మార్చేసింది. మాణిక్కం ఠాగూర్ ప్లేస్‌లో మాణిక్యరావ్ థాక్రే కొత్త ఇంఛార్జ్‌గా వచ్చారు. ఇంఛార్జ్ హోదాలో రెండోసారి ఆయన హైదరాబాద్ వస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్లు.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మధ్య సమన్వయం లేదు. ఇదే పెద్ద తలనొప్పిగా మారింది. దీనికితోడు థాక్రేకు అనేక సవాళ్లు స్వాగత పలుకుతున్నాయి. ఆ సవాళ్లను థాక్రే ఎలా అధిగమిస్తారు? ఇక్కడి పరిస్థితులను ఆయన పూర్తిగా ఆకళింపు చేసుకున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సీనియర్లను ఏకతాటిపైకి తీసుకొస్తారా?
రేవంత్‌రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య పడటం లేదు. దీనికి తోడుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డిలు కూడా అసంతృప్తితో ఉన్నారు. వీళ్లందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాల్సిన బాధ్యత ఇంచార్జ్ థాక్రేపై ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్‌లో కొంతమంది సీనియర్లు రేవంత్‌ని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం అదే ఓరవడి కొనసాగుతుంది. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, పార్టీ వ్యవహారాలపై చర్చించరనే అపవాదు పీసీసీ చీఫ్‌పై ఉంది. ఈ అంశంలో రేవంత్ రెడ్డికి థాక్రే ఏం చెప్తారు? సీనియర్లని ఎలా బుజ్జగిస్తారు అనేది ప్రశ్న. సీనియర్లు అంతా ఇటీవల పీసీసీ కమిటీల కూర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ కమిటీలను మళ్లీ సమీక్షించే అవకాశం లేదుగానీ.. సీనియర్లు కోరిన కొత్తవారికి అవకాశం ఇస్తారా? పెండింగ్‌లో ఉన్న ఆరు డీసీసీలకు అధ్యక్షుల నియమకానికి శ్రీకారం చుడతారా? మిగిలిన పార్టీ కార్యదర్శి పదవుల భర్తీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది ఆసక్తి నెలకొంది.
టీమ్‌ను సిద్ధం చేసుకున్న రేవంత్
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ముందున్న మరో సవాల్ హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర. జనవరి 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాదయాత్రకు AICC అనుమతి లేదని మహేశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు. హాత్ సే హాత్ జోడో అభియాన్‌లో స్థానిక నాయకులే బ్లాక్‌ల వారీగా పాదయాత్ర చేయాలని స్పష్టం చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు రెడీ అవుతున్నారు. జనవరి 26 నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ లేదా భద్రాచలం నుంచి పాదయాత్రకు సిద్ధమయ్యారు. దీనికోసం తన టీమ్‌ని కూడా సిద్ధం చేస్తున్నారు రేవంత్.
అనుమతి లేకపోతే రేవంత్ పాదయాత్ర ఆపేస్తారా?
అందరికీ నచ్చజెప్పే పనిలో ఉన్న ఇంఛార్జ్ థాక్రే.. పీసీసీ చీఫ్ పాదయాత్ర పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అధిష్ఠానాన్ని ఆయన ఒప్పిస్తారా? హైకమాండ్ అనుమతి ఇవ్వకపోతే రేవంత్ పాదయాత్ర ఆపేస్తారా? అనేది పార్టీలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. రేవంత్ మాత్రం పాదయాత్ర ఉంటుందని చెప్తున్నారు. పాదయాత్రపై రాహుల్ గాంధీతో కూడా చర్చించినట్టు రేవంత్ టీం చెబుతోంది. అయితే ఇంఛార్జ్ థాక్రే పార్టీలో నాయకులందరినీ ముందుగా ఏకతాటిపైకి తీసుకువచ్చి.. ఆ తర్వాతే పాదయాత్రపై అందరితో చర్చిస్తారా? లేక పాదయాత్ర చేయాలనుకుంటున్న వాళ్లందరూ చేసుకోవాలని అంటారో స్పష్టత రావాలి. అలాగే మూడు రోజుల పర్యటనలో సవాళ్లకు ఒకేసారి పరిష్కారం చూపిస్తారో.. లేక విడతల వారీ పద్ధతిని ఎంచుకుంటారో కానీ రెండోసారి తెలంగాణకు వస్తున్న ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రేపై భారీ అంచనాలే పార్టీ వర్గాల్లో ఉన్నాయి.