నిజామాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఇందూరు ప్రజా గర్జన సభలో పాల్గొని ప్రసంగించారు. ముందుగా నా తెలంగాణ కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రూ.8 వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టుకు శంకుస్థాపన తానే చేశానన్నారు. NTPC ప్లాంట్ వల్ల తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా.. నిజామాబాద్ మహిళలు పెద్ద ఎత్తున వచ్చి తనకు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: PM MODI: NDAలో చేరుతానని కేసీఆర్ నన్ను అడిగారు.. సీక్రెట్స్ బయటపెట్టిన ప్రధాని!
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. INDIA కూటమి, కాంగ్రెస్.. మహిళా బిల్లు పాస్ కాకుండా కుట్రలు చేసేవారని ప్రధాని ఆరోపించారు. మహిళా బిల్లుకు మద్దతు అని బయటకు చెబుతూ, లోపల కుట్రలు చేసేవారని మండిపడ్డారు. దేశ మహిళలు ఇచ్చిన శక్తి వల్లే తాను మహిళా బిల్లును పాస్ చేయగలిగానని తెలిపారు. ఇక తెలంగాణను నిజాం నుంచి సర్దార్ పటేల్ విముక్తి కల్పించారని.. ఇప్పుడు మరో గుజరాతీ.. తెలంగాణ సమృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. మరోవైపు దేశ అభివృద్ధిలో తెలంగాణ తన సహకారం ఉందని.. తెలంగాణనే కరోనాకి వాక్సిన్ ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ కోసం కేంద్రం భారీగా నిధులు ఇస్తే.. బీఆర్ఎస్ వాటిని లూటీ చేసిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ లూటీస్వామ్యంగా మార్చేశారని ప్రధాని మండిపడ్డారు. తెలంగాణలో ఒక కుటుంబం.. ప్రజల ఆకాంక్షల్ని కబ్జా చేసిందని తెలిపారు. కుటుంబ పాలనతో అంతా తమ వారికే లబ్ధి కలిగేలా చూసుకుంటారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ప్రధాని మోడీ అన్నారు.