నిజామాబాద్‌లో వెలుగు చూసిన ఉగ్రవాదం లింకులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కరాటే శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఓ కీలకమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కరాటే, లీగల్ అవేర్‌నెస్ ముసుగులో తెలుగు రాష్ట్రాల యువకులు ఓ వ్యక్తి భౌతిక దాడులు, మతపరమైన సంఘర్షణలు సృష్టించే కార్యకలాపాలకి శిక్షణ ఇస్తున్న వ్యక్తిని ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోలీసులు పీఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లాతో పాటు మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ మోబిన్‌లను అరెస్ట్ చేసి.. దేశద్రోహం కేసులు నమోదు చేశారు.
ఈ అరెస్ట్‌పై సీపీ నాగరాజు మాట్లాడుతూ.. కరాటే శిక్షణ, లీగల్ అవేర్‌నెస్ ముసుగులో పిఎఫ్ఐ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని అన్నారు. మతకలహాలు సృష్టించేందుకు చురుకైన అతివాదులు మతోన్మాదులకు శిక్షణ ఇస్తున్నారన్నారు. వీరికి బైంసా అల్లర్లతో సంబంధం ఉందా? లేదా? అనే విషయాలపై ఆరా తీస్తున్నామన్నారు. కడపలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం ఉందని, మరో 23 మంది కోసం గాలిస్తున్నామని చెప్పారు. కాగా.. నిషేధిత సంస్థ అయిన స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పని చేస్తోంది. నిజామాబాద్‌లోని ఆటోనగర్‌లో ఓ ఇంటిపై దాడి చేయగా.. అక్కడ మత ఘర్షణలు జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలి, భౌతిక దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నట్లు తేల్చారు.
ఆ ఇంట్లో ఒక వైట్ రైటింగ్ బోర్డు, ఫిజికల్ ట్రైనింగ్‌కి కావాల్సిన సామాగ్రితో పాటు దేశ వ్యతిరేక, హిందువుల వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన పుస్తకాలు పోలీసులకు లభ్యమయ్యాయి. అబ్దుల్ ఖాదర్ అనే 54 ఏళ్ల వ్యక్తి ఇదంతా నడిపిస్తున్నాడు. అతడ్ని విచారించగా.. యువకుల్లో హిందూ వ్యతిరేక భావజాలం నూరి పోసి, వారికి అన్ని రకాల ట్రైనింగ్‌లు ఇచ్చి, ఒక మానవ విస్పోటంగా మార్చుతామంటూ సంచలన నిజాల్ని బయటపెట్టాడు.