NITI Aayog comments on cm kcr allegation: ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలపై నీతి ఆయోగ్ స్పందించింది. కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అజెండా తయారీలో రాష్ట్రాల సహకారం లేదని కేసీఆర్ చేసిన విమర్శల్లో నిజం లేదని తేల్చిచెప్పింది. రేపటి సమావేశానికి సన్నాహకంగా తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల సీఎస్ లతో సంప్రదింపులు జరిగాయని తెలిపింది. రాష్ట్రాలతో సన్నిహితంగా పనిచేయడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని.. గత ఏడాది సీఎంలతో 30కి పైగా సమావేశాలు జరిగాయని అన్నారు. గతంలో నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ తో సమావేశం అయిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఇటీవల సమావేశం కోసం నీతి ఆయోగ్ సీఎం అభ్యర్థనలు పంపామని.. అయితే సీఎం స్పందించలేదని నీతి ఆయోగ్ వెల్లడించింది.
నీతి ఆయోగ్ ఎజెండా తయారీలో రాష్ట్రాల పాత్ర లేదన్న విమర్శలను కొట్టి పారేసింది నీతి ఆయోగ్. జూన్ లో అన్ని రాష్ట్రాల సీఎస్ లతో సమావేశం జరిగిందని.. గత నెల 7న జరిగిన సమావేశాల్లో తెలంగాణ ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపింది. గత నాలుగేళ్లుగా తెలంగాణకు జల్ జీవన్ మిషన్ కింద రూ. 3982 కోట్లు కేటాయించామని.. కానీ రాష్ట్రం రూ. 200 కోట్లు మాత్రమే డ్రా చేసుకుందని.. అదనంగా.. 2014-2015 నుంచి 2021-22 మధ్య కాలంలో ప్రధాన మంత్రి కౌషల్ వికాస్ యోజన కింద తెలంగాణకు రూ. 1195 కోట్లు విడుదయ్యాయని నీతి ఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని నీతి ఆయోగ్ వెల్లడించింది. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొనకపోవడం దురదృష్టకరం అని నీతి ఆయోగ్ అంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేటాయింపులు 2015-16లో రూ. 2,03,740 కోట్లు ఉంటే 2022-23లో రూ. 4,42,781 కోట్లుగా ఉంది, అంటే రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయని నీతి ఆయోగ్ వెల్లడించింది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల కేటాయింపులను 32% నుండి 42 శాతానికి పెంచిందని..సీఎస్ఎస్ కింద కేటాయించిన నిధుల వినియోగానికి తగిన వెసులుబాటు కల్పించిందని నీతి ఆయోగ్ వెల్లడించింది.
శనివారం జరిగిన సమావేశంలో నీతి ఆయోగ్ పై విమర్శలు గుప్పించారు. నీతి ఆయోగ్ భజన మండలిగా మారిందని.. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రులు మాట్లాడటానికి నాలుగు నిమిషాల సమయం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎజెండా రూపకల్పలో సహకార సమాఖ్య అనేది లేదని.. నీతి ఆయోగ్ ఎజెండా ఎవరు తయారు చేస్తారో తెలియదని వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో సహకరించడం లేదని విమర్శలు గుప్పించారు.