Damodara Raja Narasimha : నిమ్స్‌లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప మాట్లాడుతూ, ఈ ఏడాది తొలి 7 నెలల్లో (జనవరి–జులై) 5.44 లక్షల మంది రోగులకు వైద్య సేవలు అందించామని తెలిపారు. వీరిలో సగానికి పైగా ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్ వంటి ప్రభుత్వ పథకాల కింద ఉచితంగా చికిత్స పొందారని వివరించారు. నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నందున నిమ్స్‌ను ఆశ్రయించే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. అదేవిధంగా, ఈ ఏడాది ఇప్పటివరకు వందకు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా జరిపామని వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్స్ డైరెక్టర్, వైద్యులు, సిబ్బందిని అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో నిమ్స్‌కు వచ్చే రోగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత త్వరగా అడ్మిట్ చేసి, అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. ఎమర్జెన్సీ వార్డులో ప్రాథమిక చికిత్స అనంతరం సంబంధిత వార్డుకు షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. డైరెక్టర్ బీరప్ప వివరించిన ప్రకారం, ప్రస్తుతం నిమ్స్ ఎమర్జెన్సీకి రోజూ 80 నుంచి 100 మంది రోగులు వస్తున్నారు. వీరిలో సగం మందికి పైగా ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చికిత్స తీసుకొని, పరిస్థితి విషమించాక చివరి నిమిషంలో నిమ్స్‌కు వస్తున్నారని తెలిపారు. కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ ఆపరేషన్లు చేసి, పేషెంట్లు పూర్తిగా కోలుకోక ముందే డిశ్చార్జ్ చేసి, నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ హాస్పిటల్స్‌కు పంపిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులు నిమ్స్‌పై భారం పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి రాజనర్సింహ ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి వచ్చే పేషెంట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, అయితే ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వచ్చే వారిని కూడా సానుభూతితో చూసి చికిత్స అందించాలని సూచించారు. పేషెంట్లను సగం చికిత్సలోనే డిశ్చార్జ్ చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రభుత్వ హాస్పిటళ్ల మధ్య సమన్వయం ఉండాలని, ఎమర్జెన్సీ వార్డుల్లో బెడ్లు నిండినపుడు పేషెంట్లను మరో ప్రభుత్వ హాస్పిటల్‌కు రిఫర్ చేసి అడ్మిట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పేషెంట్‌ను రిఫర్ చేసే ముందు ప్రాథమిక చికిత్స చేసి, అవసరమైతే అంబులెన్స్‌లో డాక్టర్‌తో పంపించాలని సూచించారు. డ్యూటీ డాక్టర్లు, ఆర్‌ఎంవోలు పేషెంట్ల అడ్మిషన్, రిఫరల్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
Hyderabad Drugs: డ్రగ్స్ కావాలా నాయనా.. వాట్సాప్ లేదా టెలిగ్రామ్‌లో ఒక్క మెసేజ్ చాలు!