తెలంగాణలో ఏప్రిల్ నెల నుంచి కొత్త లబ్ధిదారులకు ఆసరా ఫించన్లను అందజేయనున్నట్లు మంత్రి హరీష్రావు వెల్లడించారు. వృద్ధాప్య ఫించన్ల మంజూరు కోసం వయో పరిమితిని ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిందని ఆయన గుర్తుచేశారు. కరోనా సంక్షోభం కారణంగా దీని అమలులో జాప్యం జరిగిందని మంత్రి హరీష్రావు తెలిపారు. 2014లో ఆసరా ఫించన్ లబ్దిదారుల సంఖ్య 29,21,828 మాత్రమే ఉండగా ప్రస్తుతం తెలంగాణలో లబ్ధిదారుల సంఖ్య 38.41 లక్షలకు పెరిగిందని స్పష్టం చేశారు.
గత ఏడున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రూ. 46,650 కోట్లను ఆసరా పింఛన్ల కోసం ఖర్చు చేసిందని మంత్రి హరీష్రావు తెలిపారు. ఆసరా ఫించన్ల కోసం 2022-2023 వార్షిక బడ్జెట్లో రూ.11,728 కోట్లు ప్రతిపాదించడం జరిగిందన్నారు. తమ హయాంలో వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, నేత, గీత కార్మికులకు ఇచ్చే ఫించన్ల మొత్తాన్ని రూ.200 నుంచి రూ.2,016కు పెంచామన్నారు. అటు దివ్యాంగులకు ఇచ్చే ఫించన్ మొత్తాన్ని రూ. 500 నుంచి రూ. 3016కు పెంచిందని గుర్తు చేశారు.