దేవేందర్‌గౌడ్ అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీలో నంబర్-2 అనే టాక్ ఉండేది. ఆరోగ్యంతోపాటు వివిధ కారణాల వల్ల చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన పేరు ఇప్పుడు అనూహ్యంగా తెర మీదికి వచ్చింది. ఎందుకంటే దేవేందర్‌గౌడ్ అప్పుడెప్పుడో పెట్టి తీసేసిన పొలిటికల్ పార్టీని లేటెస్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) తన లిస్టు నుంచి డిలీట్ కొట్టింది. ఆ పార్టీ పేరు నవ తెలంగాణ పార్టీ. నిజానికి ఆ పార్టీ పేరు మొదట్లో ఇదే. కానీ తర్వాత నవ తెలంగాణ ప్రజా పార్టీ(ఎన్‌టీపీపీ)గా మార్చారు. పార్టీకి సరైన పేరే పెట్టుకోలేకపోయారంటూ ఆ రోజుల్లో జోకులు పేలాయి.
దానికి తగ్గట్లే అది చరిత్రలో కలిసిపోయింది. ఇన్నాళ్లకి తవ్వకాల్లో బయటపడి మళ్లీ తొలగింపునకు గురైంది. రిజిస్టర్డ్ అన్-రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ(ఆర్‌యూపీపీ)ల జాబితా నుంచి మరికొద్దిరోజుల్లో శాశ్వతంగా మాయం కాబోతోంది. ఈ పార్టీకి రిజిస్టర్డ్ అడ్రస్ బంజారాహిల్స్ అని ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ చిరునామాలో ఉనికిలో లేదంట. ఒకవేళ అడ్రస్ మారితే ఆ విషయాన్ని తమకు రాతపూర్వకంగా తెలపాలని ఈసీఐ అంటోంది. ప్రజా ప్రతినిధ్య (ఆర్‌పీ) చట్టం ప్రకారం ఇది తప్పనిసరని తేల్చి చెప్పింది.
రాజకీయ పార్టీలన్నీ ఈ చట్టాన్ని పాటించేలా చూడాలని రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల(సీఈఓ)ను ఆదేశించింది. ఆర్‌యూపీపీ లిస్ట్ నుంచి తొలగించటం పట్ల ఏమైనా అభ్యంతరం ఉంటే తొలగించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు సీఈఓను కలిసి రిక్వెస్ట్ పెట్టాలని, అవసరమైన పత్రాలన్నీ అందజేయాలని ఈసీఐ సూచించింది. దేవేందర్‌గౌడ్ పార్టీతోపాటు హైదరాబాద్‌కి చెందిన మరో నాలుగు పార్టీలనూ ఈసీఐ తన జాబితా నుంచి తీసేసింది. వాటి పేర్లు.. 1. ఆలిండియా మహిళా డెమొక్రటిక్ ఫ్రంట్-సైఫాబాద్ 2. భారతీయ యువ సమతా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ-బోడుప్పల్ 3. ప్రజాచైతన్య పార్టీ-ముషీరాబాద్ 4. త్రిలింగ ప్రజా ప్రగతి పార్టీ-మధురానగర్/ఎస్‌ఆర్ నగర్.
తొలి దశలో.. దేశవ్యాప్తంగా ఉనికిలో లేని 87 ఆర్‌యూపీపీలను తొలగించిన ఈసీఐ రెండో దశలో 111 పార్టీలను డిలీట్ చేసింది. ఇదిలాఉండగా టీడీపీ నుంచి బయటికి వచ్చిన దేవేందర్‌గౌడ్ 2008లో ఈ పార్టీ పెట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 2009లో నవ తెలంగాణ ప్రజా పార్టీని చిరంజీవి పార్టీ ప్రజారాజ్యంలో విలీనం చేశారు. అనంతరం ప్రజారాజ్యం నుంచి కూడా బయటికి వచ్చి మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు. 2018 వరకు ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తర్వాత రిటైర్ అయ్యారు. ఆయన కుమారుడు విజయేందర్‌గౌడ్ ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఉన్నాడు.