Shocking Incident : హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఏళ్లుగా పాడుబడి నిలిచిన ఓ ఖాళీ ఇంట్లో మనిషి అస్థిపంజరం వెలుగులోకి రావడంతో ఆ పరిసరాల్లో తీవ్ర కలకలం నెలకొంది.
ఘటన వివరాల్లోకి వెళితే, ఓ యువకుడు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో, ఓ పాడుబడిన ఇంట్లోకి వెళ్లి లోపల ఉన్న అస్థిపంజరాన్ని చూపిస్తూ రికార్డ్ చేశాడు. ఆ వీడియో నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారి, కాస్తా వైరల్ అయ్యింది. వైరల్ వీడియోపై స్పందించిన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని గుర్తించి విచారణ ప్రారంభించారు.
అసలు విషయాన్ని పోలీసులు వెలికితీయగా.. యువకుడు ఒక క్రికెట్ బాల్ ఆ ఇంట్లో పడడంతో దాన్ని తీసుకోవడానికి వెళ్లినట్లు తెలిపాడు. ఇంట్లోకి వెళ్లినప్పుడు ఓ మూలన ఉన్న అస్థిపంజరం కనిపించడంతో అది నిజమా కాదా అనేదానిపై స్పష్టత కోసం మర్నాడు మళ్లీ అక్కడికి వెళ్లి వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశానని యువకుడు తెలిపాడు.
ఈ సమాచారం ఆధారంగా ఘటనా స్థలానికి పోలీసులు, క్లూస్‌టీమ్ చేరుకుని అస్థిపంజరాన్ని పరిశీలించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆధారాల కోసం సోదాలు నిర్వహించారు. పోలీసులు పేర్కొన్న ప్రకారం, ఆ ఇంట్లో గత ఏడు సంవత్సరాలుగా ఎవరూ నివసించడం లేదని స్థానికులు చెబుతున్నారు.
Sperm Count: వీర్యకణాల సమస్యతో ఇబ్బందులా..? బయటపడాలంటే డైట్‌లో ఇవి ఉండాల్సిందే..!
అయితే, అస్థిపంజరం ఎవరికి చెందింది? అది మగవాడిదా? మృతుడి గుర్తింపు ఎలా జరగబోతుంది? మరణానికి కారణం ఏమిటి? వంటి అనేక ప్రశ్నలకు ఈ దశలో సమాధానం లేదు. పూర్తి సమాచారం కోసం పోలీసులు మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌కు తరలించారు.
ఈ కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పాడుబడి ఉన్న ఇల్లు ఎవరిది? ఆ వ్యక్తి ఎలా మరణించాడు? ఆయన్ను ఎవరైనా హత్య చేశారా లేక సహజ మృతి చెందాడా? అన్న విషయాలపై క్లారిటీ వచ్చే వరకు ఇది తీవ్ర సంచలనంగా మారే అవకాశముంది.
ప్రస్తుతం, పోలీసుల దృష్టి వీడియో తీసిన యువకుడి వివరాలపై మాత్రమే కాదు, అస్థిపంజరం తాలూకు ఆధారాలపై మరింత దృష్టి పెట్టారు. అతి త్వరలోనే పూర్తి విచారణ నివేదిక వెలువడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.