Site icon NTV Telugu

Munugode bypolls: మునుగోడులో భారీగా నామినేషన్లు.. ఒక్కరోజే వందకుపైగా నామినేషన్లు..

Munugode

Munugode

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉపఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. చండూరులోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి… శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులతోపాటు మొత్తం వంద మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజున వందకుపైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో ఎక్కువగా ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఉన్నారు. 141 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. శని, ఆదివారాల్లో నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.

Read Also: Fact Check: అవునా? 4 జీ, 3 జీ మొబైల్స్ నిలిచిపోతాయా? నిజమెంత..?

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా మునుగోడు ఉపఎన్నికను భావిస్తున్న పార్టీలు… ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీకి నిలిచారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చివరి రోజున నామినేషన్‌ వేశారు. చర్లగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులు 8 మంది నామినేషన్లు వేశారు. 317 జీవోకు సంబంధించిన బాధితులు ఇద్దరు నామినేషన్లు వేశారు. ప్రజా శాంతి పార్టీ తరపున కేఏ పాల్‌, తెలంగాణ జన సమితి పార్టీ తరపున పల్లె వినయ కుమార్‌ గౌడ్‌లు నామినేషన్లు వేశారు. 2018 ఎన్నికల సమయంలో మునుగోడులో మొత్తం 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అప్పుడు చివరగా 15 మంది మాత్రమే బరిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఉపఎన్నిక కావడంతో నామినేషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. ఈనెల 17న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఉంది. దీంతో అప్పటివరకు వీరిలో ఎంతమంది పోటీ నుంచి తప్పుకుంటారు? ఆ తర్వాత ఎంతమంది బరిలో ఉంటారన్నది తేలాల్సి ఉంది. ఇక వచ్చేనెల 3న ఉపఎన్నిక పోలింగ్‌, 6న కౌంటింగ్ జరగనుంది.

Exit mobile version