తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల కంటే ఉప ఎన్నికలే ఉత్కంఠను రేపుతుంటాయి. 2018లో అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తర్వాత అనేక ఉప ఎన్నికలు జరిగాయి. దుబ్బాక, నాగార్జున సాగర్, హుజూర్ నగర్, హుజురాబాద్ .. ఇలా ఉప ఎన్నికలు జరిగిన చోట దుబ్బాక, హుజూరాబాద్ తప్ప అన్ని చోట్లు టీఆర్ఎస్ విజయం సాధించింది. తాజాగా మునుగోడు ఉప ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ ఆయన ఈ స్థానానికి నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకపోయినా రెండు నెలల నుండి ప్రచారంలో దూసుకుపోయిన రాజకీయ పార్టీలు తాజాగా నోటిఫికేషన్ తో తమ దూకుడు మరింత పెంచనున్నాయి..
ఆగస్టు 8వ తేదీన రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాను స్పీకర్ కు సమర్పించగా అదే రోజు ఆయన రాజీనామా ఆమోదిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది స్పీకర్ కార్యాలయం. దీంతో ఆరు నెలల లోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా ఈనెల ఏడవ తేదీన మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ను ఎలక్షన్ కమిషన్ జారీ చేయనుంది. ఈనెల 14 వరకు నామినేషన్లు స్వీకరించనున్న ఎన్నికల కమిషన్.. 15వ తేదీన స్క్రూటీని చేస్తారు.. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుండగా…. నవంబర్ 6న మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తాను అని ప్రకటించగానే ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు రాజకీయ పార్టీలు తమ కార్యాచరణతో ముందుకు పోతున్నాయి. దాదాపుగా రెండు నెలల నుండి నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం అనధికారికంగా జరుగుతుందనే చెప్పుకోవాలి. తాజాగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ దూకుడును మరింత పెంచే అవకాశం ఉంది. ఏడవ తేదీ నుండి ఉప ఎన్నికల కోడ్ అమలు లోకి వస్తుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీల ప్రచారాలను, వారి ఆదాయ, వ్యయాలు, నేతల కదలికపై అధికారుల నిఘా ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో ఉంటుంది.
1967 వరకు చిన్న కొండూరు నియోజకవర్గంగా ఉన్న నియోజకవర్గం… 1967 తర్వాత నుండి మునుగోడు నియోజకవర్గంగా మారింది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో పిడిఎఫ్ నుండి కే వెంకటరామారావు గెలిచారు. 1957లో కొండా లక్ష్మణ్ బాపూజీ కాంగ్రెస్ నుండి, 1962లో కే గురునాథరెడ్డి సిపిఐ నుండి గెలిచారు. 1965 లో వచ్చిన ఉప ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ సిపిఐ పార్టీపై గెలిచారు.. మునుగొడు నియోజకవర్గంగా ఏర్పడిన తరువాత జరిగిన తొలి ఎన్నికలో మొదటి ఎమ్మెల్యేగా 1967 లో కాంగ్రెస్ నుండి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సిపిఐ పార్టీపై గెలిచారు. అలా వరుసగా నియోజకవర్గంలో జరిగిన 16 ఎన్నికల్లో పిడిఎఫ్ ఒకసారి, సిపిఐ 7 సార్లు, కాంగ్రెస్ ఏడుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి విజయం సాధించింది. కాంగ్రెస్ గెలిచిన ప్రతిసారి సిపిఐ ప్రధాన ప్రత్యర్థిగా ఉండగా…. సిపిఐ గెలిచిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్దిగా ఉన్న పరిస్థితి. వామపక్ష పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకీ బలమైన నియోజకవర్గంగా మునుగోడుకు ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మునుగోడు నియోజకవర్గంలో మంచి పట్టుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కమ్యూనిస్టులు బలహీనపడడం, కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు సార్లు అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీల బలమైన క్యాడర్ స్తబ్దుగా ఉంది.
టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ లకు ఉప ఎన్నిక కీలకం కావడంతో మూడు పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు దాదాపుగా రెండు నెలల నుండి చేయని ప్రయత్నం లేదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తాను అని ప్రకటించిన వెంటనే నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభను సక్సెస్ చేసిన కాంగ్రెస్ అంతే దూకుడుతో తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. పీసీసీ అధ్యక్షుడు సీఎల్పీ నేతలు చెరొక మండలం ఇన్చార్జిలుగా మరికొంతమంది నేతలు మండలాలకు ఇన్చార్జిలుగా నియమించుకొని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చేజారకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా సిట్టింగ్ సీటు గెలుపే లక్ష్యంగా ముందుకు పోతుంది. మరోవైపు మునుగోడులో 2018 లో ఓటమి, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఓటమి తర్వాత… అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా కీలకంగా భావిస్తుంది.
దుబ్బాక హుజురాబాద్ లలో జరిగిన పొరపాట్లు మునుగోడులో జరగకుండా గులాబీ పార్టీ అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ బీజేపీల అభ్యర్థులు ఖరారు కాగా టిఆర్ఎస్ మాత్రం స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థి ఎంపిక పేరు ప్రకరణ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రజా దీవెన సభ నిర్వహించగా ఈ స్థానాన్ని గెలుచుకునేందుకు మరికొన్ని సభలు కూడా ప్లాన్ చేస్తుంది. ప్రతి రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యే ఇన్చార్జిగా ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించి సక్సెస్ అయిన టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతుంది.
మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో తమకు తిరుగు లేదని టిఆర్ఎస్ పార్టీ చాటి చెప్పేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. సిపిఐ సిపిఎం లతో పొత్తు పెట్టుకున్న టిఆర్ఎస్ పార్టీ బిజెపి ఓటమి లక్ష్యంగా అడుగులు వేస్తుంది… తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని గట్టిగా భావిస్తున్న బిజెపి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాలకు ఇన్చార్జిలను, ఉప ఎన్నికలకు స్టీరింగ్ కమిటీని, బూత్ ల వారిగా ఓటర్లను కలుసుకునే బిజెపి ముందుకు వెళుతుంది. ప్రధాన పార్టీలకు ఉప ఎన్నిక కీలకం ప్రతిష్టాత్మక కావడంతో ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి వెనకాడడం లేదు.
(నల్లగొండ ప్రతినిధి విజయభాస్కర్ సౌజన్యంతో..)
Read Also: Hyderabad Metro : ఇక నుంచి వాట్సప్‌లో కూడా టిక్కెట్ బుకింగ్.. ఎలాగంటే..?