విద్యార్ధుల ఫీజుల బకాయిలు విడుదల చేయాలని, స్కాలర్షిప్లు పెంచాలని తెలుగు సంక్షేమ భవనం ముట్టడించారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ తదితర కాలేజీ కోర్సులు చదివే 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల గత రెండు సంవత్సరాల ఫీజుల బకాయిలు 3300 కోట్ల విడుదల చేయాలని, పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్ రెండు రెట్లు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం మాసబ్ ట్యాంక్ తెలుగు సంక్షేమ భవనాన్ని వేలాదిమంది విద్యార్థులతో కలిసి ముట్టడించారు.
ఫీజుల బకాయిలు చెల్లించాలని, స్కాలర్షిప్ రేట్లు పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ముట్టడికి గ్రేటర్ పరిధిలోని వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య
మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు బడ్జెట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని, గత రెండు సంవత్సరాల ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా క్లాసుల నుంచి బయటకు పంపి ఎండలో నిలబెట్టి విద్యార్థులను అవమానపరుస్తున్నారన్నారు. కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. బిఇ, బి టెక్, ఫార్మసీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని మొత్తం ఫీజులు విద్యార్థులు కట్టిన తర్వాతనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నారని తెలిపారు.
Read Also: Ind Vs Zim: ధావన్, గిల్ హాఫ్ సెంచరీలు.. పసికూనపై వికెట్ పడకుండా కొట్టేశారు
ఫీజులు కట్టలేక పోతే క్లాసులకు రానివ్వడం లేదని దీంతో విద్యార్థుల చదువులు దెబ్బతింటున్నాయని కృష్ణయ్య గుర్తు చేశారు. పీజీ కోర్సులలో సీట్లు పొందిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, ఉద్యోగాలు పొందిన వారు ఇతర దేశాలలో ఉద్యోగాలు వచ్చినవారికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు ఎంపీ కృష్ణయ్య. అంతేకాకుండా పరీక్షల సమయంలో హాల్ టికెట్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. పదివేల ర్యాంకు వరకు పూర్తి ఫీజులు మంజూరు చేస్తూ మిగతా వారికి కేవలం 35 వేల మంజూరు చేస్తున్నారని మిగతా బ్యాలెన్స్ ఫీజులు కట్టలేక చాలామంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని తెలిపారు. పెరిగిన ధరల ప్రకారం కాలేజ్ విద్యార్థుల మెస్ చార్జీలు ఇంటర్ డిగ్రీ వారికి సంవత్సరానికి 5500 నుంచి 20వేల వరకు, ఇంజనీరింగ్ పీజీ కోర్సుల వారికి 6500 నుంచి 20 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు 15 వేల నుండి 3 వేలకు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మిస్ చార్జీలను 1100 నుంచి 2 వేలకు పెంచాలని అన్నారు. కాలేజీ విద్యార్థులకు సంవత్సరానికి 20వేల స్కాలర్ షిప్ ప్రతి విద్యార్థికి మంజూరు చేయాలన్నారు. బీసీలకు జనాభా ప్రకారం అదనంగా మరో 120 బీసీ గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ కాలేజీలు మంజూరు చేయాలని, అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 300 కాలేజీ హాస్టల్లు కొత్తగా ప్రారంభించాలని కోరారు. బీసీ కాలేజ హాస్టళ్లకు గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఐఐటి, ఐఐఎం కోర్సులు చదివే వారికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ధర్నాలో వేముల రామకృష్ణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, బీసీ నాయకులతో పాటు వేలాదిమంది కాలేజీ విద్యార్థులు ముట్టడిలో పాల్గొన్నారు.