MP K Laxman StrongWarning To CM KCR: బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడం, ఆయన్ను అరెస్ట్ చేయడంపై బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్న పాదయాత్రను దారుణంగా అడ్డుకున్నారన్నారు. తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండి సంజయ్ పాదయాత్రపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే.. పాదయాత్రపై దాడికి తెగబడ్డారని అన్నారు.
సంజయ్ యాత్రను అడ్డుకోవడం, ఆయన్ను అరెస్ట్ చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని లక్ష్మణ్ చెప్పారు. టిఆర్ఎస్ చౌకబారు చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బిజేపీ వైపు చూస్తున్నారని.. ఆ అసహనంతో, నిరాశ నిస్పృహలో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. పాదయాత్రకు యధావిధిగా అనుమతి ఇవ్వాలని కోరిన ఆయన.. జరిగిన ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎవరు అడ్డుపడినా, ఎన్ని దాడులు చేసినా.. పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లో అయినా జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు. యుద్ధ వాతావరణానికి తెరలేపిన సీఎం కేసీఆర్.. అందుకు రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంపీ లక్ష్మణ్ హెచ్చరించారు.