MP K Laxman Demands Apoligies From CM KCR: తెలంగాణ విమోచన అసలు చరిత్రను తాము చెప్తున్నామని, తాము చెప్పేది సజీవ సాక్ష్యమని, చరిత్రను వక్రీకరించడం లేదని ఎంపీ కే. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినంగా ఎందుకు అధికారికం చేయలేదో చెప్పాలని.. అందుకు ఆయన క్షమాపణ కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ అవసరాల కోసం మజ్లిస్‌కి టీఆర్ఎస్ లొంగిపోయిందని ఆరోపణలు చేశారు. కేంద్రం ‘విమోచన దినోత్సవం’ చేస్తున్నందుకు తాను గర్వపడుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంతో విమోచన పోరాటంలో అసువులు బాసిన వారి చరిత్ర వెలుగులోకి వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సమైక్యత పేరుతో మసి పూసి మారేడు కాయ చేస్తోందని ఆరోపించారు. మత కోణంలో చూశారు కాబట్టే కేసీఆర్ ఈ ఉత్సవాలు జరపలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. విమోచన ఉద్యమ చరిత్రను పాఠ్యాంశంలో పెడతామని హామీ ఇచ్చారు.
అటు.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్‌లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ కొన్ని సంవత్సరాలుగా ఉద్యమిస్తోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాడూ విమోచనాన్ని పట్టించుకోలేదని.. అమరులైన వీరులను, వారి త్యాగాలను గుర్తించలేదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆమరుల త్యాగాలు, వారి ఆశయాలను నెరవేర్చడంతో పాటు.. ఈ సాయుధ పోరాట చరిత్రను, వీరుల స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.