బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అడుగడుగునా బండిని అడ్డుకోవడం.. వాగ్వాదాలు, తోపులాటలు, రాళ్ల దాడులు, కోడిగుడ్లు విసరడం లాంటి ఘటనలు చర్చగా మారాయి.. అయితే.. ఈ పరిణామాలపై స్పందించిన రైతు బంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ధాన్యం సేకరణపై పాలసీ చెబితేనే బండి సంజయ్‌ని తిరగనిస్తాం అన్నారు.. బండి సంజయ్‌ను తెలంగాణ రైతుల తరపున వెంటాడతాం… వేటాడుతామన్న ఆయన.. నల్గొండ రైతులపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
100 వాహనాల్లో హైదరాబాద్ నుండి పేరు మోసిన రౌడీలతో బండి సంజయ్ నల్గొండ పర్యటనకు వెళ్లారని ఆరోపించారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. రైతులపై దాడి చేసిండి సంజయ్ మనుషులేనన్న ఆయన.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను రెచ్చగొట్టారని మండిపడ్డారు.. రైతుల కల్లాలు చూస్తున్నామని చెప్పిన బీజేపీ.. రైతుల రక్తం చూపిందని మండిపడ్డారు.. అసలు, ఏ పాలసీతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ధర్నాలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయిన పల్లా.. రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు.. ఉత్తర భారత దేశంలో ధాన్యం కొనుగోలు చేస్తూ… దక్షిణ భారత దేశంలో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరని నిలదీసిన ఆయన.. పాలసీ చెబితేనే బండి సంజయ్ ను తిరగనిస్తాం అన్నారు.