MLA Rajasingh Says Nizamabad District Becomes Target For Terrorists: నిజామాబాద్ జిల్లా టెర్రరిస్టులకు అడ్డాగా మారిందని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోధన్‌లో రోహింగ్యాలకు పాస్‌పోర్టులు ఇప్పించి.. పునరావాసం కల్పించింది ఎవరు? అని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వ నిఘా వైఫల్యంతోనే రాష్ట్రంలో ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. కేరళలో సిమి ఆర్గనైజేషన్‌ను బ్యాన్ చేస్తే.. అదే ఇప్పుడు పీఎఫ్‌ఐ పేరుతో నిజామాబాద్ జిల్లాలో వెలిసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పీఎఫ్‌ఐ వ్యూహాలు రచిస్తోందని.. పథకం ప్రకారమే హిందువులపై దాడులు జరుగుతున్నాయని రాజాసింగ్ ఆరోపించారు.
మరోవైపు.. ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’ మూడో రోజు యాత్రలో భాగంగా రాజాసింగ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేస్తానని చెప్పి, అప్పుల తెలంగాణ చేశారని విమర్శించారు. ప్రజలు కడుతున్న ట్యాక్స్ డబ్బులతో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు కడుపు నింపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది ప్రాణాలు అర్పిస్తే.. తాను తాగి పండుకుంటేనే రాష్ట్రమొచ్చిందని కేసీఆర్ చెప్తున్నారని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలిస్తామని మాటిచ్చి, ఇంతవరకూ ఉద్యోగాలివ్వలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే, తెలంగాణలో ఉన్న సమస్యలన్నింటినీ తీరుస్తామని హామీ ఇచ్చారు.