తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు, బీజేపీ నేతల మధ్య మధ్య మాటల యుద్ధంగా తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఆమధ్య బీజేపీ నిర్వహించిన ఓ బహిరంగ సభ నుంచి మొదలైన ఈ మాటల పోరు.. అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటినుంచే తమ పార్టీనే గెలుస్తుందంటూ సమరశంఖం పూరిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తమ బీజేపీనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు.
అంతేకాదు.. కేంద్రంపై యుద్ధం చేస్తానని తిరుగుతున్న సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల నిధులు వస్తున్నాయని, కానీ ఇక్కడ మంత్రులు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు నిధులు రావట్లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మెదక్‌లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన.. బీజేపీ క్యాడర్ ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాల్ని వివరించాల్సిందిగా కోరారు. ప్రధాని మోదీని టీఆర్ఎస్ నేతలు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని, తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రజల్ని మభ్యపెడుతున్నారని రాజా సింగ్ వెల్లడించారు.