MLA Raja Singh Fires On TRS Over Bandi Sanjay Attack: మూడో దశ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జనగామ జిల్లాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై జరిగిన దాడిపై ఎమ్మెల్యే రాజా సింగ్ సీరియస్ అయ్యారు. చేతకాని టీఆర్ఎస్ వాళ్లే ఈ దాడికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫాల్తు మినిస్టర్ అని, ఆయనకు ఏమీ రావని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పన్నే కుట్రలకు తాము ఆగమని.. ‘మీలాంటి కుక్కల్ని పక్కకు జరిపి బండి సంజయ్ ‘బండి’ ముందుకు సాగుతోంది’ అని అన్నారు. బీర్లు తాగించి మరీ ఈ ఎటాక్ చేయించారని టీఆర్ఎస్‌పై ఆరోపణలు చేశారు.
దాడి జరుగుతుందన్న విషయం పోలీసులకు ముందే తెలుసని, ఈ దాడిలో వాళ్లు ఇన్వాల్వ్ అయ్యారని రాజాసింగ్ ఆరోపించారు. అధికారంలో టీఆర్ఎస్ ఉండేది ఇంకో సంవత్సరం మాత్రమేనని.. బిజెపి ప్రభుత్వం వచ్చాక మీ పరిస్థితేంటో పోలీసులు ఆలోచించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ‘టీఆర్ఎస్ కుక్కులకు చెబుతున్న.. రాజకీయం ఒక పద్ధతిలో చేయండి’ అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు బయట తిరగలేరని, బీజేపీ కార్యకర్తలు తిప్పి తిప్పి కొడతారంటూ హెచ్చరించారు. బండి సంజయ్‌పై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల్ని వెంటనే అరెస్ట్ చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.