జూబ్లీ హిల్స్ అత్యాచార ఘటనలో అరెస్ట్ అయిన నిందితులపై నార్కోటిక్ టెస్ట్ చేయించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో వారిపై విచారణ జరిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ రేప్ కేసు నిందితులు ఈ ఒక్క ఘటన మాత్రమే కాకుండా మరెన్నో దారుణాలకి పాల్పడి ఉంటారని తాను అనుకుంటున్నానని అనుమానం వ్యక్తం చేశారు. ‘‘మా నాన్న టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల్లో ఉంటే మేమంతా సేఫ్’’ అనే భావనకు నేతల పిల్లలు వచ్చారని ఆయన ఆరోపించారు. మేము చేసిందే రాజ్యం, చెప్పిందే వేదమని సీఎం కేసీఆర్, ఇతర నేతలు భావిస్తున్నారని రాజా సింగ్ అన్నారు.
జూబ్లీహిల్స్ ఘటన మరువకముందే, మొఘల్‌పురలో మరో మైనర్‌ను కిడ్నాప్ చేసి రేప్ చేశారని.. టీఆర్ఎస్ నేతల వల్లే తెలంగాణ గడ్డ రేప్‌ల గడ్డగా మారిందని రాజా సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంల్లో క్రైమ్ రేటు తగ్గిందని సీఎం సహా హోంమంత్రి, కేటీఆర్ డప్పులు కొడుతున్నారని.. నిజానికి క్రైమ్ రేటు మరింత పెరిగిందని అభిప్రాయపడ్డారు. ‘‘కేసీఆర్.. ఒక్కసారి ఏసీ ఫామ్‌హౌజ్ నుంచి బయటకు వచ్చి చూడండి, తెలంగాణలో రేపులు, మర్డర్లు, క్రైమ్ రేటు పెరిగింది’’ అని ఆయనన్నారు. క్రైమ్ రేటు తగ్గింపుపై దృష్టి సారించమని నిలదీశారు. లేకపోతే.. గద్దెనెక్కించిన ప్రజలే గద్దె దింపేస్తారని ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించారు.