MLA Jagga Reddy Request CM KCR To Focus On Arogyasri Scheme: ‘ఆరోగ్య శ్రీ’ అమలు కావడం లేదని ఎంత మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ‘ఆరోగ్య శ్రీ’ని సీఎం కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ప్రతి మనిషినీ బతికించే ఆలోచన ప్రభుత్వం చేయాలని హితవు పలికారు. పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడం వల్ల.. అనేక కుటుంబాలు వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. బిల్లు 10 లక్షలు అయితే.. సీఎంఆర్ఎఫ్ (చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్) కేవలం రూ. 30 వేలే ఇస్తోందని మండిపడ్డారు. కానీ.. ఇదే కాంగ్రెస్ హయాంలో ‘ఆరోగ్య శ్రీ’ పూర్తిగా అమలయ్యేదని అన్నారు. 10 లక్షల బిల్లు వస్తే.. కాంగ్రెస్ హయాంలో రూ. 8 లక్షల సీఎంఆర్ఎఫ్ వచ్చేదని తెలిపారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ఆలోచించి పేద ప్రజల కోసం ఆరోగ్య శ్రీ పథకం తీసుకొచ్చారని.. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా ఆ పథకం బాగా అమలు అయ్యిందని జగ్గారెడ్డి చెప్పారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలలో కూడా ప్రతి పేదవాడికి సీఎంఆర్ఎఫ్ డబ్బులు ఎక్కువ మొత్తంలోనే చెల్లింపులు జరిగాయన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఆరోగ్య శ్రీ మీద దృష్టి పెట్టాలని.. ప్రతి కార్పొరేట్ హిస్పిటల్‌లో అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఇంటిలిజెన్స్ వాళ్ళు ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాల్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళేవారని.. మరి ప్రస్తుత ఇంటిలిజెన్స్ చీఫ్ ఎప్పుడైనా ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో సీఎం దృష్టికి తీసుకెళ్లారా? అని ప్రశ్నించారు. ఇప్పుడున్న ఇంటిలిజెన్స్ అంతా.. ఏ లీడర్ ఎక్కడ పడుకున్నాడు, ఏం చేస్తున్నారు? అనే పనిలోనే పడ్డారని ఎద్దేవా చేశారు. ఇకనైనా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పూర్తిగా అమలు అయ్యేలా చూడాలని.. హరీష్ రావు, సీఎం కేసీఆర్ ఈ పథకం అమలుపై ఫోకస్ చేయాలని డిమాండ్ చేశారు.