KTR: మునుగోడులో ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మునుగోడుకు మంత్రులు జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. మంత్రుల బృందం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి 11 గంటలకు మునుగోడు చేరుకుంటుంది. వీరంతా మునుగోడులోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అభివృద్ధి పథకాలను సమీక్షిస్తూనే శాఖల వారీగా చేపట్టాల్సిన పనులను సమీక్షించనున్నారు. అంతే కాకుండా ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.
Read also: ICC: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. బౌలర్ జాబితాలో లేని టీమిండియా ఆటగాళ్లు
స్థానిక సంస్థల్లో పాలన, ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కరెంట్ సమస్యలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా మున్సిపాలిటీల్లో రోడ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, జంక్షన్లు, పార్కులు, తాగునీరు, వీధిలైట్లు, డ్రైనేజీలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కూడా సమీక్షించి ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు వివిధ శాఖల రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
Enjoy Every Moment: తాత నువ్వు తోపు.. ఇంతకు ఈ పెద్దాయన ఏం చేశాడో తెలుసా!