Minister Vemula Prashanth Reddy Reviews Construction Of Police Command Control Centre: హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ప్రపంచస్థాయి కట్టడాల్లో ఒకటిగా నిలవనుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దీన్నొక అద్భుత నిర్మాణంగా అభివర్ణించిన ఆయన.. దుబాయ్‌కి బూర్జ్ ఖలీఫా, ప్యారిస్‌కు ఈఫిల్ టవర్ ఎలాగో.. హైదరాబాద్‌కు కమాండ్ కంట్రోల్ సెంటర్ అంతటి కీర్తిని తెస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ 14వ అంతస్తు నుండి చూస్తే.. హైదరాబాద్ నగరం నలువైపులా కనిపిస్తుందన్నారు. సివిల్ వర్క్స్ దాదాపు పూర్తయ్యాయని, ఫినిషింగ్ వర్క్స్ చురుగ్గా జరుగుతున్నాయని పేర్కొన్నారు. డేటా సెంటర్ కోసం బెల్జియం, జర్మనీ నుంచి పరికరాల్ని ఇంపోర్ట్ చేస్తున్నామని వివరించారు. సీఎం కేసిఆర్ ఆలోచనల నుంచి పుట్టిన మరో మణిహారమే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
కాగా.. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను డిజిపి మహేందర్ రెడ్డి, నగర్ సిపి సి.వి ఆనంద్‌తో కలిసి వేముల శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 18వ అంతస్తు వరకు ఫ్లోర్ వైస్ పనుల్ని ఆరా తీశారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని మీడియా బ్రీఫింగ్ రూమ్, ఆడిటోరియం నిర్మాణ ఫినిషింగ్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఫ్లోర్ వైస్ క్లాడింగ్, ఫాల్స్ సీలింగ్, ఫ్లోరింగ్, మిగిలిన సివిల్ పనులు త్వరగా పూర్తవ్వాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని అదేశించారు. 4వ ఫ్లోర్‌లో గల డేటా సెంటర్‌కు సంబంధించిన సెక్యూరిటీ అంశాలపై డిజిపి మహేందర్ రెడ్డి, సి.పి సివి ఆనంద్ పలు సూచనలు చేశారు. ఆ అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డిని మంత్రి అదేశించారు. కేసిఆర్ విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని సూచించారు.