బీజేపీ సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసుకుంటోందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనీ.. అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి పథకం, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు కింది స్థాయి వరకు చేరేలా ప్రయత్నం చేయాలని కార్యకర్తలకు సూచించారు. లేకుంటే ప్రతి పక్షాలు చేసే అబద్దాలే నిజమని నమ్మే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి.. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయా? అని ఆయన ప్రశ్నించారు.
మహారాష్ట్రలోని గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపాలని ఎందుకు అడుగుతారు, రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గాన్ని తెలంగాణలో కలపాలని అడిగారని ఆయన వెల్లడించారు. తెలంగాణలో అభివృద్ధి లేకుంటే ఎందుకు కలపమని అడుగుతారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులే తెలంగాణకు వచ్చి అభివృద్ధి చూసి పొగుడుతున్నారని ఆయన అన్నారు. అయినా ఇక్కడి బీజేపీ నేతలకు ఇవేమీ పట్టవని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం.. గ్రామాల్లోకి రానివ్వమని ఆయన హెచ్చరించారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బీజేపీ మనకు అవసరం లేదు అని ఆయన అన్నారు.