Ponguleti Srinivas Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. అనూహ్యంగా సీఎం రేవంత్ తన మార్కు పాలనను కొనసాగిస్తున్నారు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు మారినప్పుడు.. వాటి విధానాలు, పాలనా శైలి మారుతుంది. కాంగ్రెస్ హయాంలో కూడా ఆ మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రగతి భవన్ పేరును ప్రజా భవన్ గా మార్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పేరు మారింది. ఇక నుంచి టీఎస్‌ని టీజీగా మారుస్తూ కేబినెట్ సమావేశంలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. రాష్ట్ర చిహ్నాన్ని కూడా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ మార్పులకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుని ప్రజల అభీష్టం మేరకు మార్పులు చేస్తామని మంత్రులు వెల్లడించారు.
Read also: Top Headlines@9AM: టాప్ న్యూస్
రాష్ట్రం పేరును టీఎస్ నుంచి టీజీగా మార్చడానికి గల కారణాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గెజిట్ నోటిఫికేషన్‌లో టీజీగా ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కానీ కేసీఆర్ మాత్రం కేంద్రం విడుదల చేసిన గెజిట్ కాదని పేరును టీఎస్ గా మార్చారన్నారు. తెలంగాణను టీజీగా కొనసాగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. వాహనాల రిజిస్ట్రేషన్లతో పాటు ఏదైనా టీజీ ఉంటుందని పొంగులేటి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాష్ట్రం పేరును టీజీగా వాడుకున్నారు. నిరసనల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపై ఏపీకి బదులు టీజీ అని రాసేవారు. కానీ.. అనూహ్యంగా తెలంగాణ పేరును టీఎస్ గా నమోదు చేసేందుకు కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది. దీనిపై అప్పట్లో వ్యతిరేకత వచ్చింది. అయితే ‘టీజీ’ అంటే తెలంగాణ అనే ఒక్క పదాన్ని రెండుగా విభజించడమేనని అప్పటి ప్రభుత్వ పెద్దలు వివరించారు. తాజాగా టీఎస్ పేరును టీజీగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
UP Road Accident: వర్షంలో వేగంగా వెళ్లిన కారు.. గొయ్యిలో పడి ఆరుగురు మృతి