తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వానాకాలం పంటల సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సుని నిర్వహించారు. ఇందులో భాగంగా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఇతర లాభసాటి పంటల్ని సాగు చేయాలని, యాజమాన్య పద్ధతులు పాటిస్తూ వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకురావాలని అన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు దృష్టి పెట్టి, పంటల సాగులో ఆదర్శంగా నిలవాలన్నారు. రైతుల గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడి తగ్గిస్తూ దిగుబడులు పెంచాలని, కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేయాలని చెప్పారు.
ఎక్కడ, ఎలాంటి పంటలు వేయాలనే దానిపై కేసీఆర్ రాసిన లేఖపై కేంద్రం ఇప్పటివరకూ స్పందించలేదన్నారు. ఎన్నికల సమయంలో పసుపు బోర్డు మాట ఇచ్చి, గెలిచాక మాట తప్పారని ఆరోపించారు. ఓలా, ఉబర్ క్యాబ్ సేవల తరహాలోనే రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఐటీ, పరిశ్రమల మంత్రిత్వశాఖ చొరవ తీసుకోవాలన్నారు. చాలా మంది రైతులు వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేయలేకపోతున్నారని, ఈ నేపథ్యంలో వారికి యాంత్రీకణ సేవలు అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, భవిష్యత్ కార్యాచరణ, సాగు ప్రణాళికలపై కూడా మంత్రి చర్చించారు.
మరోవైపు.. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనపై కూడా మంత్రి స్పందించారు. సభ పెట్టుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు కానీ.. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని దశాబ్దాల కాలం పాటు ఏలిన కాంగ్రెస్, తమ కాలంలో వాళ్ల కాలంలో రైతాంగానికి ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశానని, అందులో పేర్కొన్న అంశాలపై ఇతరులతో కాకుండా స్వయంగా రాహులే జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు.