రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సోమవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం దేశానికి ఆదర్శమని ఆయన అన్నారు. రాష్ట్రంలో రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, అతి త్వరలో అందరికీ ఇండ్లు అందజేస్తామని ఆయన వెల్లడించారు.
ఒక్క పైసా తీసుకోకుండా ప్రజలకు ఇండ్లు అందిస్తున్నామని, అర్హులైన వారందరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ 8,500 కోట్లు కేటాయించామని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు పనిలేక సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? దమ్ముంటే చూపించాలని ప్రతిపక్షాలకు కేటీఆర్ సవాల్ విసిరారు.