Minister Jagadish Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)నేత, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం మోదీ ప్రభుత్ దుర్మార్గాలకు పరాకాష్ట అని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ దురాగతాలను బయటపెడుతున్నారని సీఎం కేసీఆర్ పై మోదీ కుట్ర పన్నారని, ఇందులో భాగంగానే కవితకు నోటీసులు ఇచ్చారని అన్నారు. అణచివేత దోరణితోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని బీజేపీ ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తుందంటూ దుయ్యబట్టారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్త కాదని, నియంతలు నిలబడినట్లు చరిత్రలో లేదని ఆయన అన్నారు. బీజేపీ అసలు రూపాన్ని ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తామని అన్నారు.
Read Also: MLC Kavitha: బెదిరింపు వ్యూహాలు మమ్మల్ని అడ్డుకోలేవు.. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తా..
మరోవైపు మంత్రి దయాకర్ రావు కూడా ఈడీ నోటీసులను ఖండించారు. బీజేపీ మొదటి నుంచి ఓ పాలసీని పాటిస్తోందని, ముందుగా నోటీసులు ఇస్తుంది, నోటీసులకు భయపడకపోతే తర్వాత అరెస్టులు చేస్తారు, ఆ తరువాత జైలుకు పంపుతారని అన్నారు. కవితమ్మ ఎక్కడా తప్పు చేయలేదని ఆయన అన్నారు. అరెస్టులు చేసినా నోటీసులు ఇచ్చినా వెనక్కు తగ్గేది లేదని ఆయన అన్నారు. కేంద్రప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మరో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కానుకలు ఇస్తుంటే..కేంద్రంలోని బీజేపీ మాత్రం రాష్ట్రంలోని మహిళ నేతలకు నోటీసులు ఇస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో పోరాడుదాం అనుకున్న కవితకు నోటీసులు ఇవ్వడం బీజేపీ పతనానికి నాంది అని అన్నారు. ఈడీతో రూ. 100 కోట్ల స్కామ్ జరిగిందని బీజేపీ భయపెట్టే ప్రయత్నం చేస్తోందని, ఈ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. కవిత ఎక్కడా తప్పు చేయలేదని నిర్దోషిగా బయటకు వస్తారని అన్నారు. తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని ఆమె అన్నారు.