ప్రధాని మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో గుజరాత్‌ను దాటిపోతున్నామని భయమా అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు వేరుపడ్డము.. బాగు పడ్డము.. 1999 లో కాకినాడ తీర్మానం చేసి, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మోసం చేశారని ఆయన అన్నారు. నాడు బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వకుండా దగా చేశారని, సుఖ ప్రసవం చేయంగ వద్దు అన్నమా… ఎందుకు మాట ఇచ్చి తప్పినవ్ అని హరీష్ రావు మండిపడ్డారు. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా విభజన అని ఎలా అంటారని ఆయన విమర్శించారు. ఈ స్ఫూర్తితో ఏడు మండలాలు, లోయర్ సీలేరు ప్రాజెక్ట్ ను ఆంధ్రలో కలిపారని, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందే రాత్రికి రాత్రికి కలిపేశారన్నారు. కనీసం మాట చెప్పకుండా చేసి సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ ఏర్పడితే మీకు వచ్చిన బాధ ఏమిటి.. పెప్పర్ స్ప్రే మధ్య బిల్లు పాస్ అయ్యిందట. ఎట్లా పాస్ అయుతే ఏంటి.. కాకినాడ తీర్మానం ప్రకారం మీరు ఆనాడే తెలంగాణ ఇస్తే అంత మంది బలిదానాలు జరిగేవా ఆని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆ నాడు కామన్ మినిమము ప్రోగ్రాం లో పెట్టింది. 2004 లోనే తెలంగాణ ఇస్తే ఇంత మంది విద్యార్థులు అమరులు అయ్యేవారా.. శ్రీకాంత చారి అమరుడు అయ్యేవాడా. యువకుల బలిదానాలకు కారణం ఈ బిజెపి, కాంగ్రెస్ పార్టీ..వందల ప్రాణాలు పోడానికి కారణం మీరు.. ఇచ్చిన తెలంగాణ వాపస్ పోవడం, తెలంగాణ ఆలస్యం వల్ల యువకులు చనిపోయార అని ఆయన హరీష్ రావు ధ్వజమెత్తారు. మాట మాటకు అవకాశం చిక్కినప్పుడల్లా మోడీ తెలంగాణ ప్రజలను అవమాన పరిచినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
ఇది చాలా దురదృష్టకరమని, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తెలంగాణ, బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతారని ఆయన దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో విభజన చట్టంలో చెప్పినవి అమలు చేయరు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్శిటీ ఎక్కడ పోయాయని ఆయన అన్నారు. వెనుకబడ్డ ప్రాంతాలకు ఇవ్వాల్సిన 900 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని, మోడీ..చేసేది అన్యాయం.. చెప్పేది శ్రీరంగ నీతులు అని హరీష్‌రావు అన్నారు. రాష్ట్రానికి 5000 కోట్లు రావాలంటే విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలని బడ్జెట్ లో షరతు పెట్టారని, అంటే బాయిల కడా మీటర్లు పెట్టాలి.. ముక్కు పిండి పైసలు వసూలు చేయాలి. నా గొంతులో ప్రాణం ఉండగా బాయిల కాడ మీటర్లు పెట్ట.. రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు సీఎం కేసీఆర్ అని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హరీష్ రావు ఉద్ఘాటించారు.