కరీంనగర్ జిల్లా కమాన్ వద్ద జరిగిన కారు ప్రమాదంపై మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు. ఇది చాలా బాధకరమైన ఘటన. ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లపై ఉండొద్దని చెబుతూ ఉన్నాం. సీసా కమ్ముల వారిని అక్కడ ఉండవద్దని చాలా సార్లు తీయించాం. కానీ కమాన్ దగ్గర ఉంటే ప్రమాదాలు జరుగుతాయని ముందే చెప్పాం వారు అక్కడే ఉంటున్నారు.
స్పెషల్ టీం కూడా అటువంటి వారిని తొలగిస్తుందన్నారు గంగుల కమలాకర్. ఇటువంటి ప్రమాదాలు గతంలో కూడా జరిగాయి ప్రజలు సహకారం లేకుండా ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. బ్లాక్ టాగ్ రోడ్లు పాదచారులు మాత్రమే వినియోగించుకోవాలని తీర్మానం చేశాం. నాలుగు వ్యవస్ధలను కోర్దినేషన్ చేస్తూ అడిషనల్ కలెక్టర్ ఆక్రమణలు తొలగించనున్నారు.
పట్టణంలో రోడ్లన్నీ ఆక్రమణలు జరగడం వల్ల 99 శాతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసామన్నారు. ప్రభుత్వాన్ని బెదిరిస్తామంటే కుదరదన్నారు మంత్రి గంగుల. ప్రమాద బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు కేటాయిస్తాం.
ఒక్కో బాధిత కుటుంబానికి 80 వేలు ఆర్థిక సహాయం అందించాం. గాయపడ్డ వారికి 50 వేలు ఆర్థిక సహాయం ఇచ్చి వారికి మెరుగైన వైద్యం సేవలు అందించేలా చూస్తున్నాం అన్నారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. నిన్న జరిగిన సంఘటన దురదృష్టవకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అందరం అనుకున్నాం. వారం రోజుల్లో ఆక్రమణలు లేకుండా చేస్తామన్నారు.