వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకున్న మిర్చి రైతుల ఆందోళనలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షా నిర్వహించారు. హైద్రాబాద్ నుంచి జిల్లా కలెక్టర్ గోపి, మార్కెట్ చైర్మన్ దిడ్డి భాగ్యలక్ష్మీ కుమార స్వామి, మార్కెట్ కార్యదర్శి, వరంగల్ ఛాంబర్ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. రైతులకు నష్టం జరుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు అండగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని పిలుపునిచ్చారు. రైతులను ఎవరు మోసం చేసిన ఉపేక్షించేది లేదన్నారు. గతేడాది కన్నా ఈ సారి పంటలకు మంచి ధరలు ఉన్నాయని, చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల మిర్చి పంటల దిగుబడులు తగ్గాయన్నారు. రైతులు నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. . రైతులకు మద్దతు ధరలు వచ్చే విధంగా మార్కెట్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. గిట్టుబాటు ధరలు వచ్చిన రైతులు తమ సరుకులను విక్రయించుకుని, మిగతా రైతులు ఆందోళన చెందకుండా గిట్టుబాటు ధర వచ్చే వరకు మార్కెట్‌లోని శీతలగిడ్డంగుల్లో భద్రపర్చుకోవాలని సూచించారు. గిడ్డంగుల్లో భద్రపర్చుకున్న ఉత్పత్తులపై వడ్డీలేని రుణం పొందవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు, మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రతిరోజు ధరలపై మానిటరింగ్ చేయాలన్నారు. రైతులకు అధిక ధరలు వచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కాగా ఉదయం జరిగిన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఆందోళనలు కలవరానికి గురి చేశాయి. మార్కెట్ అధికారులు పాలక వర్గం చర్చలు జరిపిన అనంతరం ఆందోళనలు సద్దు మనిగాయి.మిర్చి ధర నచ్చిన రైతులు అమ్ముకోవచ్చు. రేటు గిట్టుబాటు కాదనుకున్న రైతుల నుండి రేపు కొనుగోలు జరుపుతామన్న మార్కెట్ కార్యదర్శి రాహుల్ తెలిపారు. రేపు మిర్చి కొత్త రైతుల నుంచి కొనుగోలు ఉందని తేల్చి చెప్పిన మార్కెట్ అధికారులు పేర్కొన్నారు. రేపు మార్కెట్ కు మిర్చి తీసుకు రావద్దన్న పాలక వర్గం రైతులను కోరింది.