NTV Telugu Site icon

Medarama Jathara: జాతర మార్గంలో క్యాంపులు.. అందుబాటులో క్రేన్లు

Medaram Jatara

Medaram Jatara

Medarama Jathara: మరో నాలుగు రోజుల్లో తెలంగాణ కుంభమేళా, మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు మహాజాతర జరగనున్న నేపథ్యంలో భక్తులను మేడారం తరలించడంలో ఆర్టీసీదే ప్రధాన పాత్ర. ఇందుకు ఆర్టీసీ తగిన విధంగా సన్నద్ధమైనా బస్సులకు నిర్వహణ సమస్యలు తప్పవు. దీంతో అడపాదడపా బస్సులు ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. అయితే జాతరకు సర్వం సిద్ధం చేసుకున్న ఆర్టీసీ బస్సులు సైతం మొరాయిస్తే క్విక్ యాక్షన్ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాయి.

మొరాయిస్తున్న బస్సులను వెంటనే గాడిలో పెట్టేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు వీరంతా ఇప్పటికే వివిధ అంశాల్లో శిక్షణ పూర్తి చేశారు. జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు నలుగురు మంత్రుల బృందం మేడారానికి వెళ్లనుంది. అభివృద్ధి పనులను మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ పి.శ్రీజ మేడారం పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read also: Adlur Laxman Kumar: ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు తప్పిన ప్రమాదం

జాతర మార్గంలో శిబిరాలు

ఎప్పుడు ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. ఈ మేరకు మెకానిక్ బృందాలుగా ఏర్పడిన అధికారులు జాతర జరిగే మార్గంలో పలుచోట్ల నిర్వహణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. హనుమకొండ, గూడెప్పాడు, గట్టమ్మ, పస్రా, తాడ్వాయి, జంగాలపల్లి, గణపురం, కాటారం, నార్లాపూర్, కమరం, కొండపర్తి, మేడారం 12 చోట్ల అందుబాటులో ఉంచనున్నారు. బస్సు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి కార్లు వంటి నాలుగు చక్రాల వాహనాలు వెళ్లలేని చోట్ల ఇబ్బందులు తలెత్తితే ద్విచక్ర వాహనంపై అక్కడికి వెళ్లి మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా బృందాల సభ్యులకు నిర్దిష్ట పరిధిని కేటాయించి విధులు కేటాయించారు. తమ పరిధిలోని బస్సుల్లో లోపాలుంటే వీలైనంత త్వరగా అక్కడికి చేరుకుని మరమ్మతులు చేసి బస్సును తిరిగి రోడ్డుపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

Read also: Matka Movie : ‘మట్కా’ మూవీ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన వరుణ్..

అందుబాటులో ఉన్న క్రేన్లు

నిర్వహణ శిబిరాల్లో ఉన్న సిబ్బంది వెళ్లి మరమ్మతులు చేస్తే వెంటనే బస్సులను రోడ్డుపై నుంచి తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్య కారణంగా నిలిచిపోయిన బస్సును తరలించేందుకు ప్రత్యేక క్రేన్, ట్రాక్టర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే క్రేన్ సహాయంతో బస్సును అక్కడి నుంచి పైకి లేపుతున్నారు. ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో మేడారం మార్గంలో బస్సులు ఆగకుండా చూసుకోవడంతో పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాలను వెంటనే తరలించేందుకు గస్తీ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ గస్తీ బృందాలు మేడారం రూట్‌లో నిత్యం గస్తీ తిరుగుతూ తమ పరిధిలోని బస్సులు, ఇతర వాహనాలపై దృష్టి సారిస్తాయి. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పక్కా ప్రణాళికతో మేడారం మహాజాతరకు సిద్ధమయ్యామని అధికారులు చెబుతుండగా.. వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.
Box Office War: దేవరతో వార్… ఆ రిస్క్ అవసరమా చై?