తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (93) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఉదయం హైదరాబాద్‌లోని సీపీఎం కార్యాలయం వద్ద మల్లు స్వరాజ్యం పార్థివదేశాన్ని సందర్శనార్థం ఉంచారు. ఇప్పటికే పలువురు నేతలు మల్లు స్వరాజ్యంకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మేమంతా స్వరాజ్యం గారి బాటలో నడుస్తామని, వారి కుటుంబంలో పుట్టడం మా జన్మధన్యమని వారన్నారు.
అంతేకాకుండా మాకే కాదు, అన్యాయం పై పోరాటం చేసే ప్రతి యువతకి స్వరాజ్యం గారు నానమ్మే అని, స్వరాజ్యం బాటలోనే సమాజానికి సేవ చేస్తామని వారు అన్నారు. మమ్మల్ని విలువలతో పెంచారని, మేము స్వరాజ్యం గారి విలువలను కొనసాగిస్తామన్నారు. మహిళల కోసం ఆమె చేసిన పోరాటం ముందుకు తీసుకువెళ్తామని ప్రతిజ్ఞ చేస్తున్నామని, ఎక్కడ అన్యాయం జరిగిన గళమెత్తుతామని, ఇప్పటికే సోషల్ సర్వీస్ లో ఉన్నాం, దాన్ని మరింత స్పూర్తితో ముందుకు తీసుకెళతామని వారు వెల్లడించారు.