ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రికత్త పరిస్థితుల నెలకొన్నాయి. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ.. ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌ను ముట్టడించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టీ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి అరెస్ట్‌ను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందన్నారు. పోలీస్ రాజ్యం ఉందని చెప్పడానికే ఈ ఉదాహరణ చాలు అని ఆయన ఆరోపించారు.
ఓయూను నిజాం టైం లో కట్టారని, అక్కడ చదివిన వాళ్ళు గొప్ప గొప్ప నాయకులయ్యారన్నారు. ఇప్పుడు ఓయూ దిక్కు దివానా లేకుండా అయ్యిందని, సమస్యల వలయంలో చిక్కుకుందని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఒక ఎంపీ, ఆయన్ని అడ్డుకోవడం దారుణమని, విద్యార్థులు నిరసన తెలిపితే అరెస్ట్ చేశారన్నారు. అరెస్ట్ చేసిన స్టూడెంట్స్ ను పలకరించడానికి వెళ్తే జగ్గారెడ్డిని అరెస్ట్ చేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు.