TPCC Mahesh Goud : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్‌పై రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన వెంటనే తనపై అర్బన్ నక్సలైట్, దేశద్రోహి ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. గురువారం సీపీఐ మఖ్దూమ్ కార్యాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, మఖ్దూమ్ తెలుగు నేలపై జన్మించిన గొప్ప కమ్యూనిస్టు నేత అని కొనియాడారు. సింగరేణి కార్మిక ఉద్యమంతో ఆయనకు ఆత్మీయ సంబంధం ఉందని తెలిపారు. 1974 ఫిబ్రవరి 17న జరిగిన ఈ కార్యాలయ పునాది కార్యక్రమానికి అప్పటి కాంగ్రెస్ మంత్రులు హాజరయ్యారని గుర్తు చేశారు. కాంగ్రెస్–కమ్యూనిస్టుల అనుబంధం విడదీయరానిదని స్పష్టంచేశారు.
Tata Motors: టాటా కర్వ్.ev, నెక్సాన్.ev కస్టమర్లకు గుడ్ న్యూస్..
“నేను ఎప్పటినుంచో కమ్యూనిస్టు భావజాలానికి మద్దతుగా ఉన్నాను. ఈ దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం నిలదొక్కుకోవాలంటే లెఫ్ట్ శక్తులు బలపడాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌తో పాటు కమ్యూనిస్టులతో కలిసి విజయాన్ని సాధించాం” అని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన ఆయన, ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ భూసంపదను కార్పొరేట్ కంపెనీలకు దక్కించేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. “మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినా, కేంద్రం మానవతా దృక్పథంతో కాకుండా మారణయత్నాలతో ముందుకు వెళుతోంది. ఇది బాధాకరం” అని అన్నారు.
ఇక ఎలక్షన్ కమిషన్ వ్యవహారాలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా ఈ సంస్థ మారిందని, ఇది ప్రజాస్వామ్యానికి శోచనీయ పరిణామమని విమర్శించారు.