Tata Motors: వినియోగదారులకు టాటా గుడ్ న్యూస్ చెప్పింది. టాటా మోటార్స్ తన ఈవీ వాహనాలపై లైఫ్ టైమ్ హై-వోల్టేజ్ (HV) బ్యాటరీ వారంటీని అందించనున్నట్లు ప్రకటించింది. టాటా కర్వ్.ev కూపే, నెక్సాన్ evల 45kWh బ్యాటరీ ప్యాక్ మోడళ్లు ఈ వారంటీ కిందకు వస్తాయి. భారతదేశంలో ఈవీ కార్ల వినియోగం పెరగడం, ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను మరింత పెంచడానికి ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త కొనుగోలుదారులతో పాటు, ఈ మోడళ్లను మొదటిసారి కొనుగోలు చేసిన వారికి ఈ వారంటీని అందిస్తోంది.
Read Also: Lenovo Yoga Tab Plus: లెనోవా కొత్త ట్యాబ్లెట్ రిలీజ్.. 10,200mAh బ్యాటరీ.. మరెన్నో క్రేజీ ఫీచర్లు
టాటా మోటార్స్ కొత్తగా తీసుకువచ్చిన హారియర్ evతో లైఫ్ టైమ్ HV బ్యాటరీ వారంటీని ప్రవేశపెట్టింది. వెహికిల్ ప్రారంభ రిజిస్ట్రేషన్ నుంచి 15 ఏళ్ల వరకు అపరిమిత కిలోమీటర్లను ఇది కవర్ చేస్తుంది. ఈ లైఫ్ టైమ్ వారంటీ ప్రయత్నం ఈవీ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారి ఆందోళనల్ని పరిష్కరిస్తుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ లాంగ్ లైఫ్, రీప్లేస్‌మెంట్ ఖర్చుల్ని తగ్గిస్తుంది.
బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఖర్చుల గురించి ఆందోళనలను తగ్గించడంతో పాటు, కార్ల రీసేల్ వాల్యూ కూడా పెంచుతుందని టాటా మోటార్స్ చెబుతోంది. టాటా ఈవీ యజమానులు దశాబ్ధకాలంలో ఏకంగా రూ.8-9 లక్షల మధ్య రన్నింగ్ ఖర్చులను ఆదా చేయవచ్చని అంచనా వేస్తోంది. ఇది కొత్తగా వచ్చే వినియోగదారుల్ని ఆకర్షిస్తుందని చెప్పింది. దీనికి తోడు, టాటామోటార్స్ కర్వ్ ఈవీ, నెక్సాన్ ఈవీ 45kWh కొనుగోలు చేయాలని ఎంచుకున్న ప్రస్తుత టాటా ఈవీ కస్టమర్లకు రూ. 50,000 లాయల్టీ ప్రయోజనాలను ప్రకటించింది.