రైతుల ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలని, కేసీఆర్ కుటుంబంపై ఈడీ విచారణ జరపాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ డిమాండ్ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రౌడీ గా మారిపోయి పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏడేళ్ల నుంచి రాష్ట్ర సమితి రాబందుల సమితి గా మారిందన్నారు. పోలీసు యంత్రాంగంను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్ట్ లు, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం ఖమ్మంలో కామన్ గా మారిందన్నారు.
యువకుడు సాయి గణేష్ ఆసుపత్రిలో చెప్పిన దానిని మరణ వాంగ్మూలంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజాయితీ వుంటే సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడని బర్త్ రఫ్ చేయాలని, డీజీపీ టీఆర్ఎస్ ఏజెంట్ మాదిరిగా వ్యవహరించ వద్దన్నారు. గుడిని మింగే రాక్షసుడుగా మారింది కలవకుంట్ల చంద్ర శేఖర్ రావు ప్రభుత్వమని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ పేరుతో మిల్లర్లు తో కుమ్మక్కయ్యాడని, గవర్నర్ కూడా కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఢిల్లీలో చేసింది ధర్నా కాదు అది దగా నిరాహారదీక్ష అని మధు యాష్కీ మండిపడ్డారు.