తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో బరువుపై ఛార్జీల మోత మోగనుంది. కొద్దిరోజులుగా మాటిమాటికి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతున్న తెలంగాణ ఆర్టీసీ ఆసారి లగేజీ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొత్త ఛార్జీలు శుక్రవారం నుంచి అమలు కానున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఇకనుండి టైర్లు తీసుకెళ్లాలంటే మూడింతలు, సైకిల్ కైతే రెండింతలు లగేజీ ఛార్జీలు చెల్లించాల్సిందే. కాగా.. ఇటీవలే రెండు దఫాలుగా సెస్సులు తదితరాల పేరుతో ప్రయాణికుల ఛార్జీలను పెంచగా..తాజాగా లగేజీ ఛార్జీలను ఆర్టీసీ గణనీయంగా పెంచింది. 50కిలోల వరకు ఉచిత లగేజీకి అవకాశం ఇస్తున్నా. ఇకపై అదనపు లగేజీపై మరింత భారం కానుంది. ప్రయాణికుడు ఉచితంగా తీసుకెళ్లే 50 కిలోల బరువు కూడా మూడు ప్యాకెట్లకు ఉదాహరణకు బ్యాగులు, సూట్ కేసులు వగైరాకు మించి ఉండకూడదని, ప్రతి ప్యాకెట్ 20కిలోల బరువు మించి ఉండకూడదు, ఒకవేళ ఉచిత పరిమితలోపు ఉండే బరువు మూడు ప్యాక్ లకు మించితే అదనపు ప్యాక్‌లపై చార్జీ విధిస్తారు.
ఇటీవల టాస్క్‌ఫోర్స్ సమావేశంలో లగేజీ ఛార్జీలు సుదీర్ఘకాలంగా ఒకేలా ఉన్న అంశంపై చర్చ జరిగిన నేపథ్యంలో.. లగేజ్ ఛార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. అయితే 2002 తర్వాత ఈ ఛార్జీలను పెంచిన దాఖాలు లేవు. డీజిల్ ధరలతో పాటు మానవ వనరుల వ్యయాలను పెరగటంతో వాటిని పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఆర్టీసీ కార్గో సేవలను ప్రోత్సహించేందుకు ఆ ఛార్జీలతో సమానంగా లగేజీ ఛార్జీలను పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపై ఆర్జీసీ బస్సుల్లో ట్రక్కు టైర్లు తరలించాలంటే 3యూనిట్లుగా పరిగణించి ఛార్జీలు వసూలు చేసే పనిలో పడ్డారు. అంతేకాకుండా.. టీవీ, ఫ్రిజ్, సైకిల్, పిలింబాక్సులు, వాషింగ్ మెషీన్, కార్ టైర్లను రెండు యూనిట్లు గా, రేడియో, ఖాళీ బ్యాటరీ, టేబుల్ ఫ్యాన్, 25 లీటర్లు ఖాళీ క్యాన్, కంప్యూటర్ మానిటర్, సిపీయూ, హార్మోనియం లను ఒక యూనిట్ గా పనిణిగణించనున్నారు.
చిరువ్యాపారులపై భారం
రైతుల, చిరువ్యాపారులపై భారం పడనుంది. పల్లెవెలుగు బస్సుల్లో 25కి.మీ.దూరానికి 50కేజీల బరువుకు లగేజీ టికెట్ రూ.1 ఉండేది అయితే దాన్ని ఇప్పుడు ఏకంగా రూ.20కి పెంచారు. ఎక్స్‌ప్రెస్, ఆపై కేటగిరి బస్సుల్లో ఇదే దూరానికి ఉన్న రూ.2 ఛార్జీని రూ. 50కి పెంచింది. సిటీ బస్సుల్ని కూడా వదలకుండా పాత ఛార్జీలతో పోల్చుకుంటే పెద్దమొత్తంలో ఛార్జీలను వసూలు చేయనుంది. ప్రయాణికులు 50కిలోల బరువుండే సామాగ్రిని ఉచితంగా తీసుకెళ్లొచ్చు. అయితే ఉచిత పరిమితికి మించి ఒకకిలో ఎక్కువున్నా.. దాన్ని ఒకయూనిట్ గానే పరిగణించి ఆమేరకు ఛార్జీలు నిర్ధారించారు. ఇక పల్లెవెలుగులో ప్రతి 25కి.మీ చొప్పున , ఎక్స్‌ప్రెస్, ఆపై కేటగిరిలో ప్రతి 50కి.మీ. చొప్పున ఛార్జీ మారుతుంది.