అగ్నిపథ్ పథకంతో కేంద్రం యువతను మోసం చేస్తోందని ఆరోపించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఇది కచ్చితంగా 2024 లోక్‌సభ ఎన్నికల స్టంటే అని ఆరోపించారు. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మమతా బెనర్జీ.
అగ్నిపథ్‌పై వెనక్కి తగ్గని నరేంద్ర మోడీ ప్రభుత్వం.. అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్మీ.. ఎయిర్ ఫోర్స్, నేవీలో అగ్నివీర్ నియామక ప్రక్రియ ప్రారంభించిన కేంద్రం.. రేపు నేవీ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల.. ఈనెల 24న ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటన.
అగ్నిపథ్ ఆందోళనల కారణంగా 529 రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపించాయని రైల్వే శాఖ తెలిపింది. నేడు దేశవ్యాప్తంగా 529 రైళ్లు రద్దయినట్లు తెలిపింది. ఇందులో 181 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాగా.. 348 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఇక నాలుగు మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఆరు ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. రద్దయిన వాటిలో 71 రైళ్లు ఢిల్లీకి రాకపోకలు సాగించేవి. ఢిల్లీ శివాజీ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్‌లో నిరసనకు దిగిన హస్తం పార్టీ కార్యకర్తలు రైలును ఆపేశారు. పట్టాలపై కూర్చుని ట్రాక్‌ను నిర్బంధించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను తరలించారు.
హైదరాబాద్ సైఫాబాద్ లోని ఎల్ ఐ సి ముఖ్య కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన హైదరాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అగ్ని పథ్ పథకం ద్వారా దేశ యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్ఐసి నినాదాలు చేశారు. ఎల్ఐసీ ఆఫీస్ లోనికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు హైదరాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్, కార్యకర్తలు. వీరిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంలో గాయపడిన 9మంది ఆర్మీ అభ్యర్ధులను మరి కొద్ది సేపట్లోనే డిశ్చార్జ్ చేయనున్నారు గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది. తొమ్మిది మంది ఆర్మీ అభ్యర్ధులను డిశ్చార్జ్ చేసిన అనంతరం అరెస్ట్ చేయనున్నారు జీఆర్పీ పోలీసులు. ఇప్పటికే ఈ కేసును హైదరాబాద్ సిట్ కు అప్పగించారు జీఆర్పీ పోలీసులు. మరో నలుగురు ఇంకా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని త్వరలో డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయి.
సికింద్రాబాద్ రైల్వే విధ్వంసం ఘటన కేసుకి సంబంధించి అరెస్టయిన వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. చంచల్ గూడా జైల్ వద్ద భారీగా ఆందోళనకారుల కుటుంబాలు గుమిగూడారు. ములఖత్ లో తమవారిని కలిసి కన్నీరు మున్నీరు అవుతున్న తల్లిదండ్రులు. తమకు ఏపాపం తెలియదని తల్లిదండ్రులతో గోడు వెళ్ళబోసుకుంటున్నారు యువకులు.
సమగ్ర దర్యాప్తు చేసి ఎవరు కుట్ర చేశారో తేల్చాలని కోరుతున్నారు. మా పిల్లలు విధ్వంసంలో పాల్గొనలేదు. నిరసన కోసం మాత్రమే వచ్చారు. ఉద్యోగం కోసం గత నాలుగు సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. హైదరాబాద్ లో కోచింగ్ తీసంకుంటున్నారు. మా పిల్లలకు ఏపాపం తెలియదు. ప్రభుత్వం కలుగజేసుకొని బెయిల్ పై విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలి. సిఎం కేసీఆర్, కేటీఆర్ కలుగజేసుకొని న్యాయం చెయ్యాలని కోరుతున్నారు అరెస్ట్ అయిన యువకుల తల్లిదండ్రులు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషనలో విధ్వంసానికి సంబంధించి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావుని విచారిస్తున్నామన్నారు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి. ఆవుల సుబ్బారావును అదుపులోకి తీసుకోలేదు. సుబ్బారావును విచారిస్తున్నాం అంతే అన్నారు. తెలంగాణ పోలీసులు మమ్మల్ని సంప్రదించలేదు. యూపీ పోలీసులు సుబ్బారావును విచారించారనడంలో వాస్తవం లేదన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు సుబ్బారావు విషయంలో నిర్ణయం తీసుకుంటాం అన్నారు ఎస్పీ రవిశంకర్ రెడ్డి.
భారత్ బంధ్ నేపథ్యంలో ఏలూరు రైల్వే స్టేషన్, కలపర్రు టోల్ గేట్ వద్ద బందోబస్తును పరిశీలించారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. అనుమానితులను పరిశీలించాకే స్టేషన్ లోకి అనుమతిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.
అగ్నిపథ్ నియామకాలకు వ్యతిరేకంగా యువత నిరసన స్వరం వినిపిస్తోంది. కొన్ని సంఘాలు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో అప్రమత్తమైంది పోలీస్ శాఖ వరంగల్ నగరంలోని రైల్వే స్టేషన్లు, పోస్ట్ ఆఫీసులు, ఇన్ కం టాక్స్ ఆఫీస్, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్, ఎఫ్సీఐ గోడౌన్ తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వరంగల్ రైల్వే స్టేషన్
అగ్నిపథ్ కి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనల్లో భాగంగా ఇవాళ భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్, ఇతర ప్రాంతాల్లో నెలకొన్న అల్లర్లతో అలర్ట్ అయిన వరంగల్ పోలీసులు భద్రత ఏర్పాటుచేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా కాజీపేట్ వరంగల్ రైల్వే స్టేషన్లలో పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. ప్రయాణికుల్ని తనిఖీలు చేస్తున్నారు. గుంపులు గుంపులుగా జనం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అగ్నిపథ్ స్కీమ్ రద్దు చేయాలని ఐద్వా కమిటీ ఆధ్వర్యంలో విశాఖ మద్దిలపాలెం లో నిరసన వ్యక్తం అయింది. మద్దిలపాలెం సీఐటీయూ ఆఫీస్ నుండి బయలుదేరిన ర్యాలీ ముందుకు సాగింది. ర్యాలీలో DYFI, CITU, SFI నాయకులు పాల్గొన్నారు. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీకి అనుమతి ఇవ్వని పోలీసుల తీరుపై మండిపడ్డారు. యువత భవిష్యత్తుతో ఆటలాడొద్దంటూ...కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. CITU కార్యాలయం సమీపంలోనే ర్యాలీని అడ్డుకున్నారు పోలీసులు.
భారత్ బంద్ లో భాగంగా కేరళలో పరిస్థితులు ప్రశాంతంగా వున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఆంక్షలు అమలులో వున్నాయి. ఆస్తుల విధ్వంసానికి పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. పంజాబ్ లో అన్ని సైనిక, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బీహార్ నుంచి వెళ్లే పలు రైళ్ళను రద్దుచేయగా, చాలా రైళ్ళను తగ్గించేశారు.
కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ కార్యాలయాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉంది. నిరసనకారులు చొరబడకుండా అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు.బీహార్, బెంగాల్లో పలు రైళ్ళను రద్దుచేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. రైల్వే స్టేషన్ల వద్ద 144 సెక్షన్ అమలులో వుండడంతో ప్రయాణికులు మినహా ఎవరికీ అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బీహార్ లో ఇంటర్నెట్ పై ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ఒకవైపు అగ్నిపథ్ ఆందోళనలు.. భారత్ బంద్ జరుగుతున్న వేళ అగ్నిపథ్ నియామకాలకు సోమవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొన్నప్ప ఆదివారం ప్రకటించారు. మొదటి బ్యాచ్‌లో 25వేల మందికి డిసెంబర్ మొదటి, రెండో వారాల్లో శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు పొన్నప్ప తెలియజేశారు. రెండో బ్యాచ్ అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దాదాపు 40,000 మందిని నియమించడానికి దేశవ్యాప్తంగా 83 రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు.
భారత్ బంద్ నేపథ్యంలో విజయవాడ నగరంలో పోలీస్ పహారా, యధాతధంగా ప్రజారవాణా, తెరుచుకున్నాయి షాపులు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ల లో మోహరించారు పోలీసులు. రైల్వే స్టేషన్ లో రోబో పోలీస్ టీమ్స్ పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర అలెర్ట్ అయ్యారు. DCP బాబూరావు ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ లో బందోబస్తు కొనసాగుతోంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ బాబూరావు హెచ్చరించారు.
భారత్ బంద్ తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. విశాఖపట్నం పరిధిలోని రైల్వే స్టేషన్ ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది. సాయుధ బలగాల పహారా కొనసాగుతోంది. అనుమనితులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నారు. రైళ్ల రాకపోకలు యధాతథంగా జరుగుతున్నాయి. అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో వాల్తేర్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. బైక్, కారు పార్కింగ్ అనుమతి నిరాకరించారు. అటు, పార్సిల్ సర్వీస్ కేంద్రం దగ్గర తనిఖీలు జరుగుతున్నాయి. ప్రజా రవాణాపై భారత్ బంద్ ప్రభావం అంతగా చూపించలేదు. నెల్లూరు జిల్లాలో బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. రైళ్లు..బస్సుల రాకపోకలు మామూలుగా కొనసాగుతున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
అగ్నిపథ్ నిరసనలు, భారత్ బంద్ నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ముందు జాగ్రత్తచర్యల్లో భాగంగా స్కూళ్ళకు సెలవు ప్రకటించారు. ర్యానాలోని ఫరీదాబాద్‌లో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. నేడు 2 వేల మందికిపైగా పోలీసులు నగరంలో పహారా కాస్తారని అధికారులు తెలిపారు. అంతేకాదు, బంద్ సందర్భంగా హింసకు పాల్పడే వారిని గుర్తించేందుకు వీడియోలు కూడా తీయనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లకు వచ్చేవారికి క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నారు. నలుగురు అంతకంటే ఎక్కువగా గుమిగూడేవారిని చెదరగొడుతున్నారు.
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చిన పలు రాజకీయ పార్టీలు. హైదరాబాద్ లో బంద్ ప్రభావం అంతగా కనిపించడంలేదు. బస్సులు,రైళ్లు, వ్యాపార వాణిజ్య సముదాయాలు యథావిధిగా నడుస్తున్నాయి. బంద్ నేపథ్యంలో సికింద్రాబాద్ స్టేషన్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. స్టేషన్ నలువైపులా గట్టి భద్రత వుంది. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటనతో స్టేషన్లో నిఘా పెంచారు.
అగ్నిపథ్ కి వ్యతిరేకంగా అభ్యర్ధులు భారత్ బంద్ కి పిలుపునిచ్చారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పలు నిరసన బృందాలు నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో హర్యానా, ఝార్ఖండ్, పంజాబ్, కేరళ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి. ముఖ్యమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. సికింద్రాబాద్ స్టేషన్లో జరిగిన ఘటన నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు.