Site icon NTV Telugu

Kyathanpalli High Tension: క్యాతనపల్లిలో పొలిటికల్ వార్.. చైర్మన్ ఎన్నిక వాయిదా.. మళ్ళీ క్యాంపులకు కౌన్సిలర్లు..!

Kyatanapalli

Kyatanapalli

క్యాతనపల్లి మున్సిపాలిటీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయి, మళ్లీ ‘క్యాంపు’ రాజకీయాలు మొదలయ్యాయి.

షెడ్యూల్ ప్రకారం నేడు (ఫిబ్రవరి 17) క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, ఎన్నిక ప్రారంభమయ్యే సమయంలో బీఆర్‌ఎస్ , కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన అధికారులు ఎన్నిక ప్రక్రియను నిలిపివేశారు.

ఎన్నిక వాయిదా పడిన వెంటనే, తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్ పావులు కదిపింది. సీపీఐకి చెందిన నలుగురు కౌన్సిలర్లతో కలిపి మొత్తం 14 మంది సభ్యులను మూడు ప్రత్యేక వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు (క్యాంపులకు) తరలించారు. ప్రస్తుతం క్యాతనపల్లిలో బీఆర్‌ఎస్ + సీపీఐ (4) మొత్తం 14 ఓట్లు ఉండగా, కాంగ్రెస్ + ఇండిపెండెంట్ (1) మొత్తం 8 ఓట్లు ఉన్నాయి.

తమకు స్పష్టమైన కోరం (మెజారిటీ) ఉన్నప్పటికీ, కావాలనే కుట్రపూరితంగా అధికారులు ఎన్నికను వాయిదా వేశారని బీఆర్‌ఎస్ , సీపీఐ నేతలు మండిపడుతున్నారు. అధికారుల తీరుకు నిరసనగా రేపు (ఫిబ్రవరి 18) క్యాతనపల్లి మున్సిపాలిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, తక్షణమే ఎన్నిక నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సగం ధరకే Havells వాటర్ హీటర్..! ఫీచర్లు అదరిపోయాయి.!

Exit mobile version