Kunamneni Sambasiva Rao Elected As CPI State Secretary: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ పదవి కోసం పార్టీ చరిత్రలోనే తొలిసారి నిర్వహించిన ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. తన ప్రత్యర్థి పల్లా వెంకటరెడ్డిపై ఆయన పదిహేను ఓట్ల తేడాతో గెలుపొందారు. అంతకుముందు ఈ ఎన్నిక విషయంపై బుధవారం శంషాబాద్‌లో నిర్వహించిన మహాసభల్లో అర్థరాత్రి వరకూ వాడీవేడీ చర్చలు సాగాయి. తమకే అవకాశం ఇవ్వాలంటూ.. ఇద్దరు నేతలు పట్టు వీడకపోవడంతో, హైడ్రామా నడుమ ఈ ఎన్నికను నిర్వహించారు. మొత్తం 110 కౌన్సిల్ సభ్యులు ఓటింగ్‌కు హాజరు అవ్వగా.. కూనంనేనికి 59, పల్లా వెంకటరెడ్డికి 45 ఓట్లు పోలయ్యాయి. దీంతో.. కూనంనేని సాంబశివరావు విజయం సాధించినట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. కొత్తగూడెం ఎమ్మెల్యేగా పని చేసిన ఈయన.. సీపీఐ 3వ మహాసభ వరకు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పని చేశారు.
నిజానికి.. పార్టీ నియమావళి ప్రకారం రాష్ట్ర కార్యదర్శిగా మూడు సార్లు మాత్రమే కొనసాగే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఏర్పడ్డాక చాడ వెంకట్‌రెడ్డి రెండు సార్లు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మూడోసారి కూడా తనకే అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ, ఈసారి తనకు అవకాశం కల్పించాలని కూనంనేని ముందుకొచ్చారు. అప్పుడు ఏకగ్రీవమైతేనే తాను కొనసాగుతానని, ఒకవేళ పోటీ అనివార్యమైతే తాను పోటీ నుంచి విరమించుకుంటానని అన్నారు. ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా పల్లా వెంకట్‌రెడ్డి పేరు తెరమీదకొచ్చింది. పల్లాకు రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం ఇవ్వాలని చాడ వెంకట్‌రెడ్డి ప్రతిపాదనని ముందుకు తెచ్చారు. పార్టీ అధిష్టానం ఎంత బుజ్జిగించినా, ఎవ్వరూ వెనక్కు తగ్గలేదు. దీంతో.. కూనంనేని, పల్లాల మధ్య ఓటింగ్ అనివార్యమైంది.