Kunamneni Sambasiva Rao Arrested: పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుని అరెస్ట్ అయ్యారు. ప్రధాని మోడీ పర్యటనను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న ఆయన.. నేడు మోడీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రామగుండం బయల్దేరారు. అయితే.. ఉదయమే పోలీసులు ఆయన్ను అడ్డుకొని, అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ స్టేషన్‌కి తరలించారు. ఆయన స్టేషన్‌లోనే దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ అరెస్ట్‌లు అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఎక్కడో జిల్లాల్లో నిరసనలు తెలియజేస్తే.. మోడీకి హాని జరుగుతుందా? అని ప్రశ్నించారు. నిరసన తెలియచేయడం పౌరుల ప్రజాస్వామిక హక్కు అని తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు.. ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రామగుండంలో మోడీ వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిసాయి. తెలంగాణకు ఇచ్చి హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ.. గుర్తుతెలియని వ్యక్తులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఐటీఐఆర్ ఏర్పాటు, టెక్స్‌టైల్ పార్కు, మిషన్ భగీరథ నిధులు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, డిఫెన్స్ కారిడార్, బయ్యారం స్టీల్‌ప్లాంట్, మెడికల్ కాలేజీలు, పసుపు బోర్డు ఏర్పాటు, ఐఐఎం తదితర అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ.. ఆ హామీల సంగతేంటని నిలదీశారు. అటు.. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు ఆందోళన బాటపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించడంతో పాటు నల్లజెండాలను ఎగరేసి.. మోడీ గోబ్యాక్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదన్న ఉద్దేశంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. నాయకుల్ని, నిరసనకారుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు.