Kuna Srisailam Goud Challenges KCR and TRS: కుత్బుల్లాపూర్‌కు ఓ దద్దమ్మ ఎమ్మెల్యే ఉన్నాడంటూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌పై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిందేమీ లేదని, ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కేశాడని ఫైర్ అయ్యారు. ‘‘కేసీఆర్, కేటీఆర్‌లకు నేను సవాల్ చేస్తున్నా.. కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో వర్షం పడితే, రోజులు తరబడి గల్లీల్లో తిరగలేని పరిస్థితి ఉంది’’ అని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఊడిగం చేసినోడు ఎమ్మెల్సీగా ఉన్నాడని.. ప్రధాని నరేంద్ర మోడీ, బండి సంజయ్, బీజేపీపై విమర్శలు చేయడం తప్ప, వాళ్లకు ఏమీ తెలియదని విమర్శలు గుప్పించారు. ఇంకోసారి బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తే.. తాట తీస్తానంటూ వివేకానంద్ని హెచ్చరించారు.
ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుంటున్నారని.. 168 సర్వే నెంబర్లో పేదలకు ఇంతవరకూ రిజిస్ట్రేషన్ చేయించలేదని కూనం శ్రీశైలం గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగద్గిరిగుట్టలో బస్ డిపో కట్టిస్తానని హామీ ఇచ్చి.. ఐదేళ్లు గడిచినా దాన్ని కట్టలేదని అన్నారు. సిగ్గు, లజ్జా ఉంటే.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్ని గాల్లో కలిసిపోయాయని చెప్పారు. కుత్బుల్లాపూర్ ప్రాంత వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని, ఈ ప్రాంత సమస్యలపై తాను బండి సంజయ్‌కి వివరించానని పేర్కొన్నారు. ఇక రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రపై కూడా కౌంటర్లు వేశారు. కాంగ్రెస్ చేయాల్సింది జోడో యాత్ర కాదు.. ఛోడో యాత్ర అంటూ కూన శ్రీశైలం గౌడ్ సెటైర్లు వేశారు.