KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్‌కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు

  • గ్లోబరీనా ఆరోపణలపై డిఫమేషన్ నోటీసు
  • లై డిటెక్టర్ పరీక్షకు కేటీఆర్ సవాల్
  • కాంగ్రెస్-బీజేపీపై తీవ్ర విమర్శలు
  • పాదయాత్రపై కీలక ప్రకటన
Ktr Revanth

Ktr Revanth

KTR : వరంగల్‌లో నిర్వహించిన చిట్ చాట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్లోబరీనా సంస్థ తనదంటూ చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డికి డిఫమేషన్ నోటీసులు పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆ నోటీసుకు సరైన సమాధానం ఇవ్వకపోతే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గ్లోబరీనా సంస్థతో తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేస్తూ, ఒకవేళ అది తన సంస్థే అయితే ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందం ఎందుకు కుదుర్చుకుందో చెప్పాలని నిలదీశారు. విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని, దమ్ముంటే విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. అవసరమైతే ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షకు వెళ్దామని, దానికి సీఎం సిద్ధమా అని సవాల్ విసిరారు.

రేవంత్ పాలన, బీజేపీతో అంతర్గత బంధంపై ధ్వజం

రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా ఒక్కసారి కూడా ‘జై తెలంగాణ’ అని అనలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాత కేసుల బూజు దులుపుతారనే భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీని, ప్రధాని మోదీని ఏమీ అనలేకపోతున్నారని ఆరోపించారు. సింగరేణిలో భారీ కుంభకోణాలు జరుగుతున్నా బీజేపీ మౌనంగా ఉంటోందని మండిపడ్డారు. పగలు కాంగ్రెస్, రాత్రి బీజేపీగా వ్యవహరించే నైజం రేవంత్ రెడ్డిదని, ఢిల్లీకి వెళ్తే బీజేపీ నేతల కార్లలో తిరుగుతారని తీవ్ర విమర్శలు చేశారు. తమది ‘తెలంగాణ జాతి’ అని, బ్యాగులు మోసే జాతి లేదా దగుల్బాజీ జాతి కాదని స్పష్టం చేశారు. అర్ధరాత్రి కాళ్లు పట్టుకునే దుస్థితి తమకు అలవాటు లేదని వ్యాఖ్యానించారు.

అవినీతి ఆరోపణలు , రాబోయే రాజకీయ కార్యాచరణ

రేవంత్ రెడ్డి బావమరిది అమృత్ కాంట్రాక్టుల్లో తీవ్ర కుంభకోణానికి పాల్పడుతున్నారని, అందులో నుంచి కాంగ్రెస్‌కు ఒక మూట, బీజేపీకి రెండు మూటలు పంపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. గ్లోబరీనా, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ వంటి ఏ అంశంపైనా కేసులు పెట్టుకోవచ్చని, తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గ్లోబరీనా సంస్థ తనదేనని నిరూపిస్తే రాహుల్ గాంధీతో వచ్చి తన ఇంటి ముందు ధర్నా చేయాలని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి బాధ్యతారాహిత్య మాటలు మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో జిల్లాల నుంచే తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని, త్వరలోనే అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసేలా ముమ్మర రాజకీయ ప్రణాళికతో ముందుకు వెళ్తామని వెల్లడించారు.