NTV Telugu Site icon

KTR: నూకల ఎగుమతిపై కేంద్రం నిషేధం.. అదే కారణమని కేటీఆర్‌ ఫైర్‌

Ktr

Ktr

నూకల ఎగుమతిపై నిషేధం విధించింది కేంద్రం.. ఎగుమతి పాలసీ సవరించిన కారణంగా నూకల ఎగుమతిపై నిషేధం విధించినట్లు పేర్కొంది.. వెంటనే నిషేధం అమల్లోకి వచ్చినా.. ఉత్తర్వులు రాకముందు నౌకల్లోకి ఎక్కించిన నూకలను సెప్టెంబర్ 15 వరకు అనుమతించబడతాయని స్పష్టం చేసింది.. గత ఏడాదితో పోలిస్తే ఖరీఫ్ సీజన్‌లో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో.. ధరలు పెరగకుండా నియంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే, కేంద్రం తాజాగా నిర్ణయంపై సీరియస్‌గా స్పందించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతోనే దేశంలో ప్రస్తుతం ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది మండిపడ్డారు.. నరేంద్ర మోడీ సర్కార్ కు ముందుచూపు లేకపోవడంతో ప్రమాదంలో దేశ ఆహార భద్రత అని పేర్కొన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత ఆలోచనలతో ఆహార ధాన్యాలను కొనకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు.

Read Also: Ganesh Laddu Rs. 46 lakh: బాలాపూర్‌ గణేష్‌ రికార్డు బ్రేక్‌.. రూ.46 లక్షలు పలికిన గణపతి లడ్డూ..

ఇక, తెలంగాణ విఫలమైందని చూపే ప్రయత్నంలో నరేంద్ర మోడీ సర్కార్‌ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని ఆరోపించారు కేటీఆర్.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని ఆరు నెలల కిందట తాము కోరితే.. దేశంలో అవసరానికంటే ఎక్కువ ఆహార నిల్వలు ఉన్నాయని చెప్పి కేంద్రం తిరస్కరించిందని.. ప్రస్తుతం కొరతకు కారణమేంటో చెప్పాలంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను డిమాండ్‌ చేశారు. దేశంలో నాలుగేళ్ల వరకు సరిపోయే నిల్వలు ఉన్నాయని చెప్పారు.. నాలుగేళ్లకు సరిపోయే గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరు నెలల క్రితం గొప్పగా చెప్పిన కేంద్ర సర్కార్.. తాజాగా బియ్యం ఎగుమతులను నియంత్రించి 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించిందని మండిపడ్డారు.. ఎఫ్‌సీఐ గోదాముల్లో, ఇతర కేంద్రాల్లో బియ్యం, నూకలు, గోధుమల నిల్వలు భారీగా తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా ఆహార ధాన్యాల కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే సేకరణ విధానం “వన్ నేషన్- వన్ ప్రొక్యూర్మెంట్” అనుసరించాలని సూచించిన ఆయన.. తెలంగాణలో పుట్లకొద్దీ పండిన ధాన్యాన్ని కొనకుండా దేశ ప్రజల ఆహార భద్రతను కేంద్రం పణంగా పెట్టిందన్నారు.. ఇప్పటికైనా దేశ ప్రజల ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ని డిమాండ్‌ చేశారు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్.