Kondagattu Temple : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణానికి బదులు ఇప్పుడు భూవివాద సెగలు కనిపిస్తున్నాయి. ఆలయ అభివృద్ధి పనుల విషయంలో దేవాదాయ శాఖ , అటవీ శాఖల మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. ఈ రెండు శాఖలకు ఒకరే మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, అధికారులు మాత్రం ఒకరిపై ఒకరు నోటీసులు ఇచ్చుకోవడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ వివాదానికి ప్రధాన కారణం ఆలయ పరిధిలో ఉన్న సుమారు ఆరు ఎకరాల భూమి. ఈ స్థలం కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 643 సర్వే నెంబర్లో ఉందని, ఇది తమ శాఖకు చెందిన భూమి అని అటవీ శాఖ గట్టిగా వాదిస్తోంది. ఈ మేరకు ఆలయ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రస్తుతం ఆలయ ఈఓ కార్యాలయం, అన్నదాన సత్రం, ఆగమ వేద పాఠశాల వంటి కీలక కట్టడాలు ఈ వివాదాస్పద స్థలంలోనే ఉన్నాయి.
అటవీ శాఖ నోటీసులపై కొండగట్టు ఆలయ ఈఓ శ్రీకాంత్ రావు తీవ్రంగా స్పందించారు. అటవీ శాఖ అధికారులు అవగాహన లేకుండా, ఎలాంటి గెజెట్ ఆధారాలు లేకుండా నోటీసులు ఇచ్చారని ఆయన కొట్టిపారేశారు. సదరు భూమి ఆలయానిదేనని ఆయన స్పష్టం చేయడమే కాకుండా, అటవీ శాఖపై తిరుగుదాడికి దిగారు. ఆలయ అనుమతి లేకుండా తమ భూముల్లో అటవీ శాఖ రోడ్డు వేయడం హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై తాము కూడా నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.
ఈ భూవివాదం ఇప్పుడు ఆలయ అభివృద్ధికి అడ్డంకిగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో టీటీడీ నుండి మంజూరైన రూ. 35 కోట్లతో ఇక్కడ భారీ నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 96 గదులతో కూడిన కాటేజీలు, 2000 మంది భక్తులు ఒకేసారి మాల విరమణ చేసేలా హాల్ నిర్మాణం వంటి పనులకు వచ్చే నెల 3వ తేదీన పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే స్థలం విషయంలో స్పష్టత లేకపోతే ఈ కొత్త నిర్మాణాలు ఎలా సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఈ మొత్తం వ్యవహారంలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, అటవీ , దేవాదాయ శాఖలు రెండూ మంత్రి కొండా సురేఖ గారి పరిధిలోనే ఉన్నాయి. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని అంతర్గత చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సింది పోయి, అధికారులు బహిరంగంగా నోటీసులు ఇచ్చుకోవడం వల్ల ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఒకే గొడుగు కింద ఉన్న రెండు శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు.