Site icon NTV Telugu

Konda Vishweshwar Reddy: బీజేపీలో చేరనున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..! ఈసారి పక్కా..?

Konda Vishweshwar Reddy

Konda Vishweshwar Reddy

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం మరోసారి తెరపైకి వచ్చింది.. గత కొంతకాలంగా విశ్వేశ్వర్‌రెడ్డి చేరికపై వార్తలు వస్తూనే ఉన్నాయి.. అధిష్టానం నుంచి పెద్ద లీడర్లు ఎవరు రాష్ట్రానికి వచ్చినా.. ఆయన సమక్షంలో కొండా బీజేపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగుతూ వచ్చింది.. ఈ మధ్య పాదయాత్రలో ఉన్న బండి సంజయ్‌ని కలిశారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చిన నేపథ్యంలో.. ఆయన బీజేపీలో చేరడం ఖాయమనే చర్చ సాగింది.. ఇక, కాంగ్రెస్‌ పార్టీకి ఆయన రాజీనామా చేసిన తర్వాత.. అనేక సార్లు బీజేపీ నేతలు ఆయన్ను కలుస్తూ వచ్చారు.. ఇవాళ బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో సమావేశం అయ్యారు.. బీజేపీలో చేరాలని ఆహ్వానించారు.

ఇక, ఆయన బీజేపీలో చేరేందుకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది.. హైదరాబాద్‌ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనుండగా.. ఎల్లుండి హైదరాబాద్‌ రానున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. అయితే, జులై 2వ తేదీన జేపీ నడ్డా సమక్షంలో.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. కొండా సానుకూలంగా స్పందించినట్టు బీజేపీ వర్గాలు చెబుతుండగా.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది.. అయితే, మంచి రోజు చూసుకుని పార్టీ కండువా కప్పుకుంటానని హామీ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుండగా.. ఎల్లుండి ఆయన బీజేపీలో చేరతారా? మరికొంత సమయం తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.. కానీ, ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం మాత్రం ఖరారైనట్టు చెబుతున్నారు.

Exit mobile version